డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్ మథుర జిల్లా ఉదియగర్హీ గ్రామంలో కొందరు అతివాదుల గుంపు శివాలయంపై దాడి చేసింది. దేవాలయాన్ని ధ్వంసం చేసి దేవతల విగ్రహాలను విరగ్గొట్టి, ఆ ప్రాంతంలో నిప్పు పెట్టారు. గ్రామస్తులు వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయడంతో అక్కణ్ణుంచి పారిపోయారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ దాడికి పాల్పడింది ‘అంబేద్కరైట్లు’ అని తెలిసింది. దేవాలయం ఉన్న ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడమే వారి లక్ష్యమట. దానికోసం ప్రాచీన శివాలయం మీదున్న త్రిశూలం, నాగదేవత విగ్రహాలను పగలగొట్టారు. మరికొన్ని పటాలను చించిపోగులు పెట్టి వాటికి నిప్పు పెట్టారు. అదే సమయంలో ఆ అతివాదులు ఆ గుడిలోపల బి.ఆర్ అంబేద్కర్ ఫొటో ఒకదాన్ని పెట్టారు. నిజానికి, ఆ గుడిలో పూజలు చేసే గ్రామస్తుల్లో అత్యధికులు ఎస్సీలే.
గ్రామస్తులు విషయం తెలిసి దేవాలయానికి చేరుకుని అక్కడ ధ్వంసం చేస్తున్న అతివాదులను నిలువరించే ప్రయత్నం చేసారు. అంతలో వారు పారిపోయారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికంగా శాంతిభద్రతల పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు ఒక బృందాన్ని అక్కడ ఉంచారు. పోలీసులు గుడిని పరిశీలించినప్పుడు అక్కడ దేవతల బొమ్మలతో వేసిన టైల్స్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు వెల్లడైంది.
ఆ సంఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను గ్రామస్తులు గుర్తించారు. పవన్, రాజు, లోకేంద్ర, కృష్ణ, రోహిత్ అనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితులను పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.