మూడో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం
మహిళల క్రికెట్ పోటీలో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ కు ముందు జరిగిన టీ 20 సిరీస్ ను భారత్ మహిళల క్రికెట్ జట్టు 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది.
ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ జరిగింది. మూడో మ్యాచ్ లో విండీస్ పై భారత్ , ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 38.5 ఓవర్లు ఆడి 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
చినెల్లె హెన్రీ (61), క్యాంప్‌బెల్( 46), ఆలియా అల్లెనీ (21) పరుగులు చేశారు. ఓపెనర్లు క్వినా జోసెఫ్, హేలీ మాథ్యూస్ డకౌట్ కాగా దియేంద్ర దొట్టిన్ ( 5), జైదా జేమ్స్ (1) పెవిలియన్ కు క్యూకట్టారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ 6 వికెట్లు, రేణుకా ఠాకూర్ సింగ్ 4 వికెట్లు పడగొట్టారు.
భారత జట్టు విండీస్ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని 28.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి సాధించింది. దీంతో సిరీస్ 3-0తో కైవసం చేసుకుంది.
భారత ఓపెనర్లలో స్మృతి మంథాన( 4), ప్రతీక రావల్ ( 18 ) విఫలమయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్(1) కూడా నిరాశపరిచింది. దీంతో కెప్టెన్ హర్మీన్ ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చి 22 బంతుల్లో 32 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (29) రాణించడంతో భారత్ కు విజయం మరింత సునాయాసంగా దక్కింది. ఆట ముగిసే సమయానికి దీప్తి శర్మ(39), రిచాఘోష్( 23) అజేయంగా క్రీజులో ఉన్నారు.
విండీస్ బౌలర్లలో దియేంద్ర దొట్టిన్, అలియా అల్లెన్, హేలీ మాథ్యూస్, అఫై ఫ్లెచర్, కరిష్మా తలా ఒక వికెట్ తీశారు.