చెక్క పెట్టలో శవం పార్శిల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబరు 19న, తులసి ఇంటికి చెక్క పెట్ట పార్శిల్‌లో మృతదేహం వచ్చింది. వెంటనే భయపడిన తులసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు కొలిక్కి తీసుకువచ్చారు. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ ప్రమేయం ఉన్నట్లు జిల్లా ఎస్పీ
నయీం అస్మీ చెప్పారు. ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం.
రంగరాజు కుమార్తెలు రేవతి, తులసి. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. రంగరాజుకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. అది మొత్తం కొట్టేయాలని రేవతి, ఆమె భర్త శ్రీధర్ వర్మ పక్కా ప్లాన్ వేశారు. ముందుగా తులసికి చెక్క పెట్టెలో శవాన్ని పంపించి బెదిరించాలని ప్లాన్ వేశారు. అందుకు ఆమె నిర్మిస్తున్న ఇంటికి క్షత్రియ సంఘం ముసుగులో ఓసారి సాయం అందించారు. రెండో సారి చెక్క పెట్టలో శవాన్ని, ఓ లేఖను పంపించారు. లేఖలో రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చెక్కపెట్టలో శవం చూడగానే తులసి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. అనేక మార్గల్లో అన్వేషణ చేశారు. చివరకు పర్లయ్య అనే వ్యక్తిని చంపి చెక్కపెట్టెలో పంపినట్లు నిర్థారించారు. శ్రీధర్ వర్మ కోసం 100 మంది పోలీసులు గాలించారు. రెండు వారాలుగా చిక్కకుండా తిరుగుతోన్న వర్మను మచిలీపట్నంలో అరెస్టు చేశారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.