పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కి హతమయ్యాడు. ఇతడు ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కు బావమరిది అవుతాడు.
గత కొంత కాలంగా మధుమేహంతో బాధపడుతున్న హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కి, నేటి ఉదయం గుండెపోటుతో లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠా 2008 నవంబర్ 26న ముంబైలో మారణహోమానికి పాల్పడింది. 10 మంది ఉగ్రవాదులు సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 166 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడులకు మక్కి ఆర్థిక సాయం అందించాడు.
మే 2019లో మక్కిని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి, లాహోర్‌లో గృహనిర్భంధంలో ఉంచింది. టెర్రర్ ఫైనాన్సింగ్‌కు సంబంధించిన కేసులో దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.
యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
ముంబై ఉగ్రదాడితోపాటు ఎర్రకోటపై దాడిలోను మక్కికీ ప్రమేయం ఉండటంతో భారతదేశ భద్రతా సంస్థలు వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాయి.