త్వరలో ప్రారంభం కానున్న మహాకుంభమేళాను సురక్షితంగా నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ క్రమంలో భక్తుల భద్రత కోసం మొట్టమొదటిసారిగా నీటి అడుగున డ్రోన్స్ వినియోగించబోతోంది. సనాతన ధర్మంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాకు 45కోట్లమంది హాజరవుతారని అంచనా.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా. ఆ పర్వం సందర్భంగా ప్రయాగలోని త్రివేణీ సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించాలన్నది హిందువుల విశ్వాసం. దానికోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. నదీస్నానాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించడానికి ‘అండర్ వాటర్ డ్రోన్స్’ను ప్రవేశపెడుతోంది. అవి నీటి అడుగున వంద మీటర్ల వరకూ వెళ్ళగలవు. వాటి సాయంతో నీటిలో కూడా 24 గంటలూ నిఘా ఉంచడం సాధ్యమవుతుంది. తద్వారా భక్తుల భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవచ్చు.
అత్యాధునిక సాంకేతికత కలిగి ఉండే ఈ డ్రోన్‌లు తక్కువ వెలుగు ఉన్నప్పుడు కూడా సమర్ధంగా పనిచేయగలవు. తద్వారా భూమ్యుపరితలానికి దిగువన జరిగే కార్యకలాపాలను సైతం కచ్చితంగా పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. నీటిలో వంద మీటర్ల లోతు వరకూ వెళ్ళగలవు కాబట్టి ఈ డ్రోన్లు రియల్ టైమ్ రిపోర్ట్‌లను సమకూర్చగలవు. ఆ నివేదికలు ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరతాయి. అందువల్ల నీటి అడుగున అనుమానాస్పదమైన సంఘటనలు ఏవైనా జరిగినా క్షణాల్లో తెలుసుకుని చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది.
బుధవారం నాడు ప్రయాగరాజ్ ఈస్టర్న్ జోన్ ఐజీ డాక్టర్ రాజీవ్ నారాయణ్ మిశ్రా హైస్పీడ్ అండర్ వాటర్ డ్రోన్‌ను ప్రారంభించారు. ఆ డ్రోన్లు ఎంత దూరం నుంచైనా లైవ్ డేటాను పంపించగలవని, అందువల్ల నీటి అడుగున పరిస్థితుల గురించి, అనుకోకుండా జరిగే ప్రమాదాల గురించీ వేగంగా సమాచారం అందుతుందని ఆయన వివరించారు.
ఈ డ్రోన్లకు తోడు పీఏసీ, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంటాయి. భద్రతా బలగాలతో నిండిన 700కు పైగా బోట్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే లైఫ్ బాయ్స్ కూడా ప్రవేశపెట్టారు. అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో చిక్కుకునే వారిని ఆ లైఫ్ బాయ్స్ వేగంగా చేరుకుని రక్షించగలుగుతాయి.
ఇలా, మహాకుంభమేళా 2025కు హాజరయ్యే భక్తులకు అన్నిరకాలుగానూ రక్షణ కలిగించడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కారు గతంలో ఎన్నడూ లేనివిధంగా అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.