కర్ణాటకలోని బెళగావి (బెల్గాం)లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ మరణంతో సమావేశాలను అర్ధాంతరంగా నిలిపివేసారు. కానీ అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ముద్రించిన భారత పటం వివాదాస్పదమైంది. ఆ పటంలో పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను వదిలేసారు. అదేదో పొరపాటున జరిగిన తప్పు కాదు. భారతదేశపు ప్రాదేశిక సమగ్రత విషయంలో కాంగ్రెస్ సైద్ధాంతిక వైఖరికి నిదర్శనం అది. ముస్లిముల బుజ్జగింపు ధోరణిలో భాగంగా కశ్మీర్‌ను భారత్‌కు చెందినది కానిదిగా చూపడం కాంగ్రెస్ పార్టీకి నిత్యకృత్యం అయిపోయింది.
కాంగ్రెస్ వైఖరిని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేదీ ఈ విషయమై మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తుల భావజాలాన్ని సమర్ధిస్తూ కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘దేశ ప్రజల భావోద్వేగాలను విస్మరించడంలో కాంగ్రెస్ నిలకడగా ఉంటోంది. తాజాగా మహాత్మా గాంధీ చిత్రం పక్కన ముద్రించిన భారత పటంలో పీఓకే, అక్సాయ్ చిన్ ప్రాంతాలను వదిలేసింది. అది మన దేశాన్ని ప్రత్యక్షంగా అవమానించడమే. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాణీ లక్ష్మీబాయి, గురుగోవింద్ సింగ్ వంటి మహానుభావుల త్యాగాలతో సుసంపన్నమైన మన దేశచరిత్రను అవమానించడమే’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఎందుకు పదేపదే భారతదేశపు తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శిస్తూ ఉంటుంది? దేశంలోని ప్రధానమైన భూభాగాలను వదిలిపెట్టేసిన పటాలను ప్రచారంలో పెడుతూ ఉంటుంది? బహుశా భారతదేశపు సార్వభౌమత్వాన్ని మార్చేయాలన్న దురుద్దేశం కలిగిన నిగూఢమైన కుట్రలో భాగంగా కాంగ్రెస్ అలాంటి పని చేస్తూ ఉండి ఉండవచ్చు’’ అని సుధాంశు త్రివేదీ మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్ భూభాగాల చుట్టూ ఆవరించి ఉన్న వివాదాల చారిత్రక నేపథ్యంలో కాంగ్రెస్ చర్యల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి
అంతేకాదు. రాహుల్ గాంధీ, శశి థరూర్ వంటి కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా అటువంటి ఉద్దేశాలను ప్రచారం చేయడం గమనిస్తే జాతి ఆత్మాభిమానాన్ని పలచబారేలా చేసేందుకు కలసికట్టుగా ప్రయత్నిస్తున్నారన్న ఆందోళన కలుగుతుంది. భారతదేశపు ఐక్యతనే దెబ్బ తీసే అలాంటి చర్యలకు కాంగ్రెస్ నాయకులు పదేపదే పాల్పడుతుండడం ఒక ట్రెండ్‌గా మారింది.
‘‘భారతదేశపు సుస్థిరతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న జార్జి సోరోస్ వంటి బాహ్యశక్తుల ప్రభావమా, లేక కాంగ్రెస్‌కు పుట్టుకతోనే సహజంగా వచ్చిన దేశ వ్యతిరేక లక్షణం కారణమా… దేనివల్ల ఇలా భారతదేశపు పటాన్ని వక్రీకరించి ప్రజల్లోకి వదులుతున్నారు’’ అని సుధాంశు త్రివేదీ మండిపడ్డారు.
సీడబ్ల్యూసీ సమావేశాల సందర్బంగా బెళగావిలో గాంధీపై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. అయితే ఆ వేడుకలకు సంబంధించిన పోస్టర్లు, కార్యక్రమాల్లో మాత్రం గాంధీ బొమ్మయినా లేదు. దానిపై కర్ణాటకలోని ప్రముఖ నాయకులు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, గాంధీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన తీరుపై నిరాశ చెందారు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ వారసత్వాన్ని సైతం వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నకిలీ గాంధీ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నకిలీ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు.
జేడీఎస్ నేత కుమారస్వామి సైతం తన నిరాశ వ్యక్తం చేసారు. ‘‘గాంధీ గౌరవార్థం ఏడాది పొడుగూతా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నేను చూసిన కటౌట్లు వేటిలోనూ మనం గౌరవించే గాంధీ బొమ్మే లేదు, అందరూ కొత్త నాయకుల బొమ్మలే ఉన్నాయి’’ అని చెప్పారు. ‘‘గాంధీ వంటి గొప్ప నాయకుడి బోధనలు, త్యాగాలు ఇప్పటి కాంగ్రెస్ నాయకులకు కనీసం గుర్తున్నాయా?’’ అని సందేహించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చర్యలు చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రత విషయంలో సైతం రాజీ పడేలా ఉంది. అలాంటి వారి చర్యలపై నిఘా పెట్టాల్సిన అవసరముంది. ఈ పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవాలని, మన పవిత్ర మాతృభూమిని చిన్నచూపు చూసే అలాంటి శక్తులను గుర్తించాలనీ బీజేపీ దేశప్రజలకు పిలుపునిచ్చింది.