పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అయితే దీని ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. గడచిన 24 గంటల్లో కావలి, నెల్లూరు, గూడూరులో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 18 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో 20 మి.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
ఆవర్తనం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలకు తగ్గింది. రాబోయే 24 గంటలు వాతావరణంలో చలి తీవ్రత పెరగనుంది. ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠంగా 9, గరిష్ఠంగా 24 డిగ్రీలు నమోదైంది.
వరిసాగు రైతులు రేపటి వరకు నూర్పిడి పనులు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని సలహా ఇచ్చారు. ధాన్యంలో తేమ తగ్గేలా చర్యలు తీసుకోవాలని రైతులకు వ్యవసాయశాఖ సూచించింది. ధాన్యం మొలకలొచ్చే అవకాశముందని తడవకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్పారు.