అన్నా వర్సిటీ ఘటననకు నిరసనగా కొరడదెబ్బలు కొట్టుకోవాలని నిర్ణయం
డీఎంకే అధికారం కోల్పోయే వరకు చెప్పులు ధరించనని శపథం
డీఎంకేను అధికారం నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. అన్నావర్సిటీలో జరిగిన దారుణ ఘటనకు నిరసనగా నేడు తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు కొట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన అన్నామలై, అన్నావర్సిటీ ఘటనను ఖండిస్తూ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. అధికారం మాటున దాష్టీకాలకు పాల్పడటం మానుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి హితవుపలికారు.
తమిళనాడులోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కనక్షన్లు ఇవ్వకపోవడం సిగ్గు చేటు అని దుయ్యబట్టారు. తాజాగా చోటుచేసుకున్న ఘటనల ద్వారా విద్యార్థినులకు భద్రత లేదన్నది స్పష్టమవుతోందన్నారు.
అన్నా వర్సిటీలో ఓ విద్యార్థిని తన మిత్రుడితో కలిసి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వారిపై దాడి చేశాడు. అనంతరం విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు, రాష్ట్రప్రభుత్వ తీరును బీజేపీ తప్పుబట్టింది. బాధితురాలకి అండగా నిలవడంలో విఫలమయ్యారని నిరసనలు చేపట్టారు. నిందితుడికి డీఎంకే సంబంధాలు ఉన్నాయన్నారు. డీఎంకేలోని ఓ ముఖ్యనేత, మంత్రితో అతడికి సంబంధం ఉందన్నారు.
ఘటన రాజకీయంగా దుమారం రేపడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలి పేరు, వివరాలు, మొబైల్ నంబర్లే కాకుండా, ఎఫ్‌ఐఆర్ ఎలా లీక్ అయిందో పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతి వివరాలను బహిర్గతం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయడం తీవ్రమైన విషయం అన్నారు. అందుకు నిరసనగా తన నివాసం వద్ద ఆరు కొరడా దెబ్బలను స్వయంగా కొట్టుకోనన్నట్టు ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు.
అన్నావర్సిటీ లో లైంగిక వేధింపుల ఘటనను కర్ణాటక, తమిళనాడు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కోఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖండించారు. బాధితురాలి తరఫున మాట్లాడుతున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదన్నారు.
కేసులో నిందితుడు కోట్టూర్‌పురం జ్ఞానశేఖరన్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.జ్ఞానశేఖరన్‌పై 15 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2011లో వర్సిటీలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది.
పోలీసుల అదుపులో నుంచి పారిపోయేందుకు యత్నించిన జ్ఞానశేఖరన్, కిందపడటంతో ఎడమ చెయ్యి, ఎడమ కాలు విరిగాయి.