మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూసారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశం పునర్వికాసానికి కృషి చేసిన మేధావి మరణించారు.
నిన్న గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయనను రాత్రి సుమారు 8.30గంటలకు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 9.51 గంటల సమయంలో మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
92ఏళ్ళ మన్మోహన్ సింగ్ వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఇంటిదగ్గర అకస్మాత్తుగా స్పృహ తప్పిపోయారని, ఆస్పత్రిలో ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఫలితం లేకపోయిందనీ ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
మన్మోహన్ సింగ్‌కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి సంతాపసూచకంగా కేంద్రప్రభుత్వం ఏడు రోజుల సంతాపదినాలు ప్రకటించింది. రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. మన్మోహన్ మరణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమై, మాజీ ప్రధానికి నివాళులు అర్పించనుంది.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం కర్ణాటకలోని బెళగావిలో జరుగుతోంది. మన్మోహన్ మరణ వార్త తెలియడంతో సీడబ్ల్యూసీ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలోనే ఉన్న సోనియాగాంధీ, ప్రియాంక విషయం తెలిసిన వెంటనే ఎయిమ్స్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే వారం రోజుల పాటు అన్ని కార్యక్రమాలనూ రద్దుచేసింది.