ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ బాంబు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. యెమెన్‌లో బాంబు దాడుల తరవాత పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లిన టెడ్రోస్ సనా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉండగా సమీపంలో వైమానిక దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు.
యెమన్ కేంద్రంగా హౌతీలు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రతిదాడులు ప్రారంభించింది. విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలు, హౌతీ శిబిరాలు, హమాస్, హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించిన 24 గంటల్లోనే భీకర దాడులు మొదలుపెట్టారు. హౌతీలు గత కొంత కాలంగా టెల్‌అవీవ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పలువురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. దీంతో హౌతీలకు హమాస్‌కు పట్టినగే పడుతుందని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు.
పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలో హౌతీలు, హెజ్బొల్లా తీవ్రవాదులు చొరబడ్డారు. యెమెన్, లెబనాన్, ఇరాన్ నుంచి దాడులు కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రతిదాడులు చేస్తోంది. ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించే వరకు యుద్దం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఖతర్, ఈజిప్ట్ దేశాల నేతలు జరిపిన కాల్పుల విరమణ చర్చలు కూడా విఫలం అయ్యాయి.