అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అయ్యప్ప మాలలో ఉన్న భక్తుడిపై ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. స్వామి దీక్షలో ఉన్న వెంకటేష్ అనే యువకుడి మీద మీద జియా ఉల్ హక్ అనే యువకుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేసాడని స్థానికులు ఆరోపించారు.
ఈ సంఘటన డిసెంబర్ 25 బుధవారం రాత్రి మదనపల్లె ఆర్‌టిసి బస్‌స్టాండ్ సమీపంలో జరిగింది. జియా ఉల్ హక్ ద్విచక్రవాహనం రోడ్డుకు అడ్డంగా ఉంది. దాన్ని పక్కకు తియ్యమని వెంకటేష్ అడిగాడు. దానితో ముస్లిం యువకుడికి కోపం వచ్చింది. అతను హిందూ యువకుడి మీద దాడికి దిగాడు. వెంకటేష్ వేసుకున్న స్వామి మాల తెంచేసాడు. అతని చొక్కా చింపేసాడు. ఇంకా భౌతిక దాడి కొనసాగిస్తుండగా, స్థానికులు అక్కడ చేరుకుని, జియాఉల్ హక్‌ను నిలువరించారు.
విషయం తెలిసిన వెంటనే హిందూ సంస్థల కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. వెంకటేష్ ధరించిన అయ్యప్ప మాల మీద ముస్లిం వ్యక్తి దాడి చేయడాన్ని ఖండిస్తూ నినాదాలు చేసారు. స్వామి దీక్షలో ఉన్న వ్యక్తిపై దాడి చేసి, అయ్యప్ప స్వామిని అవమానించిన బీదర్‌కు చెందిన ముస్లిం యువకుడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
గొడవ పెద్దది అవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించారు. వారు జియా ఉల్ హక్‌ను పట్టుకుని, అతనితో క్షమాపణ చెప్పించారు. ముస్లిం యువకుడు, తాను దాడి చేసిన వ్యక్తి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడంతో అయ్యప్ప భక్తులు శాంతించారు.
సంక్రాంతికి ముందు భక్తులు అయ్యప్ప మాల వేసుకుని మండల దీక్ష చేపట్టడం తెలుగు రాష్ట్రాల్లో సాధారణమైన విషయం. అయితే అలాంటి దీక్షాపరుల మీద ఇతర మతస్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈమధ్యకాలంలో వెలుగు చూస్తున్నాయి. ఈ నెల మొదట్లో అంటే 7వ తేదీన అయ్యప్ప భక్తులున్న బస్సు మీద ముస్లిం మూక దాడి చేసిన సంఘటన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది. బస్సులో ఉన్న భక్తులు అయ్యప్ప భజనలు ఆలపించుకుంటూ ఉండగా, ముస్లిములు దాడి చేసారు. భజనలు బస్సు బైటకు వినిపించాయన్న నెపంతో ఆ దాడికి పాల్పడ్డారు.