కప్పల తక్కెడలాంటి ఇండీ కూటమిలో రోజుకో గొడవ నడుస్తోంది. తాజాగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో అధికార పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మీద అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తమ పార్టీకి చెందిన ఢిల్లీ నాయకుడు అజయ్ మాకెన్ మీద చర్యలు తీసుకోకపోతే ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలని మిగతా పార్టీలను కోరతామని ప్రకటించింది. దాంతో ప్రతిపక్షాల ఐక్యత ఓ అబద్ధమేనని మరోమారు నిర్ధారణ అయింది.
ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి కాంగ్రెస్ సాయం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ‘‘ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. అజయ్ మాకెన్ బీజేపీ రాతలు చదువుతున్నారు, బీజేపీ తరఫున ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ సూచనల మేరకు ఆమ్ ఆద్మీ నాయకులను లక్ష్యం చేసుకున్నారు. నిన్న అన్ని హద్దులూ దాటేసారు, మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌ను దేశవ్యతిరేకి అని వ్యాఖ్యానించారు’’ అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. అజయ్ మాకెన్ కానీ, కాంగ్రెస్ కానీ ఢిల్లీలోని ఏ బీజేపీ నాయకుణ్ణీ దేశవ్యతిరేకి అనలేదని గుర్తుచేసారు.
ఆప్, కాంగ్రెస్ మధ్య లోక్‌సభ ఎన్నికల సమయం నుంచే గొడవ జరుగుతోంది. ఆ సమయంలో ఇరు పార్టీల నాయకులూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రచారం చేసారు. చివరికి ఢిల్లీలోని ఏడు స్థానాలూ బీజేపీ గెలుచుకుంది. ‘‘కేజ్రీవాల్ ఢిల్లీలోనూ, చండీగఢ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులకోసం ప్రచారం చేసారు. పార్లమెంటులోనూ పలు అంశాల్లో కాంగ్రెస్‌కు ఆప్ అండగా నిలుస్తోంది. అలాంటిది, మా నాయకుణ్ణే దేశవ్యతిరేకి అంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు’’ అని సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌తో పొత్తుకు ఆమ్ ఆద్మీ ప్రయత్నించిందని సంజయ్ సింగ్ అన్నారు. ‘‘కానీ కాంగ్రెసే ఒప్పుకోలేదు. అందుకే మేము పోటీ చేసాం. కానీ కాంగ్రెస్ పార్టీకి, దాని నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి ఒక్క మాట చూపించండి’’ అని నిలదీసారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని అవధులూ దాటేసింది అని సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అజయ్ మాకెన్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. అతని మీద 24 గంటల్లోగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మేం ఇండీ కూటమిలోని మిగతా భాగస్వాములను కలుస్తాం, కూటమి నుంచి కాంగ్రెస్‌ను తీసేయాలని అడుగుతాం’’ అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి కూడా దాదాపు అవే మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ మాటలు, చేతలు చూస్తుంటే ఢిల్లీ ఎన్నికల వరకూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టే ఉంది అన్నారు. ‘‘బీజేపీ మీద కాంగ్రెస్ ఒక్కసారైనా పోలీసులకు ఫిర్యాదు చేసిందా? లేదు. కానీ ఆప్ నాయకులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
ఢిల్లీ కాంగ్రెస్ నిన్న బుధవారం నాడు 12 అంశాలతో ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ఢిల్లీలో పర్యావరణం విషయంలో సరిగ్గా నిర్వహించలేదని, శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదనీ.. ఇలా పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆ శ్వేతపత్రం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలపై విమర్శలు గుప్పించింది.
ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మీద విరుచుకుపడ్డారు. అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. కానీ జనలోక్‌పాల్ ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పెద్ద మోసగాడు. దేశం మొత్తం మీద మోసగాళ్ళకు మోసగాడు ఎవరంటూ అది కేజ్రీవాలే. అందుకే కేజ్రీవాల్ ప్రభుత్వం మీద, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీదా శ్వేతపత్రం తీసుకొచ్చాం’’ అని అజయ్ మాకెన్ చెప్పారు.
ఇండీ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోను, పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌కు ప్రత్యర్ధిగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఓడించి, దేశ రాజధానిలో కాంగ్రెస్ 15ఏళ్ళ పాలనకు ముగింపు పలికింది ఆమ్ ఆద్మీ పార్టీయే.