సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం
అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం
సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా కల్పించారు.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట ప్రభుత్వాధికారులు ప్రదర్శించారు. దీనిపై పలువురు సినీ పెద్దలు మాట్లాడగా, ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు.
శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని తేల్చి చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలని సూచించారు. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటామన్నారు.
పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని తెలిపిన సీఎం రేవంత్, టికెట్ ధరలు, సినిమా అదనపు షోల నిర్వహణపై చర్చించి నిర్ణయించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య గ్యాప్ ఉందనేది అపోహే అని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే తమ లక్ష్యం అన్నారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చిన్న విషయాలన్నారు.