కామారెడ్డి జిల్లాలో ఘటన
ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రితీలో మృతిచెందడం కలకలం రేపుతోంది. ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేపటర్ చెరువులో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
బిక్కనూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. బుధవారం రాత్రి ఇదే చెరువు నుంచి కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను బయటకు తీశారు.
ఎస్ఐ సాయికుమార్‌తో పాటు మహిళా కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ అనే యువకుడు నిన్న మధ్యాహ్నం ఒకే సారి అదృశ్యం కావడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో శ్రుతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యం అయ్యాయి.
జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగించగా, గురువారం ఉదయం ఎస్ఐ సాయికుమార్ మృతదేహం లభ్యమైంది.
ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శ్రుతితో పాటు యువకుడు నిఖిల్ కలిసి చెరువు వద్దకు ఎందుకు వెళ్ళారు. ఎలా చనిపోయారు అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాయికుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో పని చేయగా, శ్రుతి కూడా అక్కడ కానిస్టేబుల్‌గా పని చేసింది. సాయికుమార్ బిక్కనూరుకు బదిలీ అయ్యారు.
బీబీపేటకు చెందిన నిఖిల్ అనే యువకుడు సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా, కంప్యూటర్ రిపేర్ వర్క్ కూడా చేస్తుంటాడు. పోలీస్ స్టేషన్లో కంప్యూటర్లు రిపేరు చేస్తుంటాడని చెబుతున్నారు.