తీర్థరాజంగా పేరున్న ప్రయాగరాజ్‌తో చైనా యాత్రికులకు 1400 సంవత్సరాలకు పైబడే అనుబంధం ఉంది. సామాన్య శకం 7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు ష్వన్‌జాంగ్ (హుయాన్‌త్సాంగ్) ప్రయాగలో పర్యటించాడు. ఆ ప్రాంతపు ఘనమైన సంస్కృతిని, సమృద్ధినీ ప్రశంసిస్తూ తన రచనల్లో ప్రస్తావించాడు.
భారతదేశంలో 16ఏళ్ళ పాటు విస్తృతంగా పర్యటించిన ష్వన్‌జాంగ్, తన రచన ‘సి-యూ-కి’లో సామాన్యశకం 644లో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు హర్షవర్ధనుడి ఏలుబడిని గొప్పగా మెచ్చుకున్నాడు. ఆ ప్రాంతంలో సమృద్ధిగా పండే పంటల గురించి, అనుకూలమైన వాతావరణం గురించి, ప్రయాగలో ఉండడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించీ గొప్పగా రాసాడు. ఆ ప్రాంతంలో పండ్లచెట్లు కూడా విస్తారంగా పెరుగుతుండడాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రయాగ నగరపు నిరాడంబరత, మేధో వికాసం, సముజ్వల సాంస్కృతిక జీవనాలు ష్వన్జాంగ్ను మంత్రముగ్ధుణ్ణి చేసాయి.
ప్రయాగరాజ్ చారిత్రక ప్రసిద్ధిని చెబుతూ అక్కడ ఘనంగా జరిగే ధార్మిక ఉత్సవాలను వర్ణించాడు ష్వన్‌జాంగ్. పర్వదినాల సమయంలో భారత ఉపఖండం నలుమూలల నుంచీ రాజులు, మహారాజులు సహా 5లక్షల మందికి పైగా ప్రయాగను సందర్శించేవారట. గంగా యమునా నదుల మధ్య సుమారు 40 కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో విస్తరించి ఉండడం కూడా ప్రయాగ మహానగరానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించిపెట్టింది. ష్వన్‌జాంగ్ దర్శించిన దేవాలయాల్లో పాతాళపురి దేవాలయం విశిష్టమైనది. ఆ దేవాలయంలో ఒక నాణెం వేస్తే బైట వెయ్యి నాణేలు దానం చేసిన దానితో సమానమైన పుణ్యం వస్తుందని ప్రజలు భావించేవారట. అలాగే, ఆలయం ఆవరణలో ఉన్న అక్షయ వటవృక్షం దగ్గర స్నానం చేస్తే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని విశ్వసించేవారట. ఇంక గంగా యమునా సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమానికి ప్రతీయేటా లక్షల్లో భక్తులు వస్తుండేవారని ష్వన్‌జాంగ్ రాసాడు. సంపన్నులైన భక్తులు సంగమ క్షేత్రంలో పవిత్ర స్నానాలు ఆచరించి పెద్దమొత్తంలో దానాలు చేసేవారని ష్వన్‌జాంగ్ తన రచనలో రాసాడు. ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆ సంప్రదాయం నేటికీ నిలిచే ఉంది. ఈ భూమ్మీద జరిగే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభమేళాలోనూ భక్తులు దానధర్మాలు చేస్తుంటారు.
మేజా తహసీల్, బేలన్ లోయ ప్రాంతాల్లో పురావస్తుశాఖ అధ్యయనాల్లో అక్కడ చరిత్ర పూర్వ నాగరికతల అవశేషాలు బైటపడ్డాయి. అవి ప్రయాగరాజ్ సాంస్కృతిక వారసత్వాన్ని ధ్రువీకరించాయి. 1960లలో అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని ప్రాచీన చరిత్ర విభాగం నిర్వహించిన సర్వేల్లో ప్రయాగలో హనుమాన్‌గంజ్, మజ్‌గవాన్, లోన్ ఘాటీ వంటి ప్రాంతాలు బైటపడ్డాయి. వాటిని బట్టి పేలియో లితిక్, నియో లితిక్ కాలాల్లో సైతం ప్రయాగలో మానవుల సంచారం ఉండేదని స్పష్టమైంది.
ప్రయాగ క్షేత్రపు సాంస్కృతిక ఆధ్యాత్మిక ఘనతను ప్రస్తావించిన చైనీస్ యాత్రికుడు ష్వన్‌జాంగ్ ఒక్కడే కాదని, ఇంకా మరికొందరు చైనీస్ పర్యాటకులు కూడా ప్రయాగ గురించి ప్రస్తావించారనీ ‘సరస్వతి’ పత్రిక సంపాదకుడు అనుపమ్ పరిహార్ వెల్లడించారు. ‘ప్రయాగ్ కీ ధార్మిక్ ఔర్ ఆధ్యాత్మిక్ విరాసత్’ అనే తన రచనలో ఆయన ఎన్నో విశేషాలు ప్రస్తావించారు. ప్రత్యేకించి, హర్షవర్ధన చక్రవర్తి త్రివేణీసంగమం దగ్గర పర్వదినాల సందర్భాల్లో ధార్మిక ఉత్సవాలను భారీస్థాయిలో వైభవంగా నిర్వహించాడనీ, ఆ సంప్రదాయాన్ని తరువాతి తరాలు కొనసాగించేలా పునాది వేసాడనీ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో ఉత్తరప్రదేశ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ప్రముఖ కేంద్రస్థానంగా ప్రయాగరాజ్‌ను అభివృద్ధి చేసారు. 2025లో మహాకుంభమేళా నిర్వహణకు నగరం సిద్ధమవుతోంది. ఆ విశిష్ట పర్వదిన సందర్భానికి అధికార యంత్రాంగం రూ.6వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమావేశంగా నిలిచే మహాకుంభమేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి, భక్తులకు ఆధ్యాత్మిక సౌరభాలు పంచిపెట్టడానికి ప్రయాగ నగరం శోభాయమానంగా సిద్ధమవుతోంది.