వదిన ఆస్తి కోసమే మరిది హత్య చేశాడా…?
పథక రచనెవరిది… కుట్రదారులెందరు…?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘శవం పార్సిల్ డోర్ డెలివరీ ’ కేసు చిక్కుముడి వీడుతోంది. పార్సిల్ పెట్టెలో శవం మిస్టరీలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఆస్తి కోసం వదినను బెదిరించేందుకు అమాయకుడైన వ్యక్తిని పొట్టనబెట్టుకున్నారా..? హత్యకు పథనం రచన ఎవరు చేశారు. హత్యమాటున ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఉంటే కుట్రలో పాత్రదారులు ఎందురు అనే కోణాల్లో పోలీసు విచారణ కొనసాగుతోంది.
అసలేం జరిగిందంటే…?
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి లో ఓ మహిళకు పార్సిల్ వచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో కుళ్ళిన శవం ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది.
ఈ కేసులో ప్రధాన అనుమానితుడు గాఉన్న శ్రీధర్‌వర్మ తన వదిన సాగి తులసికి చెందాల్సిన ఆస్తిని కాజేసేందుకు ఆ కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని పంపినట్లు నాటకం ఆడాడని, ఆ తర్వాత పార్సిల్ శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని పథకం పన్నినట్లుగా తెలుస్తోంది. తులసిని భయపెట్టేందుకు ముందుగా ఎక్కడి నుంచైనా శవాన్ని తేవాలని ప్రయత్నించారని, అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
పర్లయ్యను కారులో ఎక్కించుకుని ఉండి మండలం పెదపుల్లేరు దారిలో వెళ్లినట్లు తేలింది. ఈ నెల 17న హత్య చేస్తే 19వ తేదీ వరకు మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు. తులసిని బెదిరించడం ద్వారా వచ్చే ఆస్తిని ఎంతమంది కాజేయాలనుకున్నారనే విషయంపై విచారణ జరుగుతోంది.
పార్సిల్ పెట్టెలో శవం ఘటన బయటకు పొక్కిన వెంటనే అదృశ్యమైన శ్రీధర్‌వర్మను మచిలీపట్నం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తులసికి ఉన్న సుమారు మూడెకరాల ఆస్తి కోసం ఈ కుట్రకు పాల్పడ్డారా లేదా మరేదైనా ఉందా , కుట్రలో భాగస్వాములు ఎంతమంది అనే విషయంపై విచారణ కొనసాగుతోంది.