బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, బలహీన పడేందుకు మరో 24 గంటలు పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రక్రియ మొత్తం సముద్రంలోనే జరుగుతుందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు కురవనున్నాయి. నేటి నుంచి 28 వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళలో రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. చలికి తోడు మంచుకారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తగ్గే అవకాశముంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లా పరిధిలోని సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. తూపిలిపాళెం తీరంలో దాదాపు 5 మీటర్ల మేర ఎగసి పడుతున్నాయి.