మెరుగుపడిన శ్రీతేజ్ ఆరోగ్యం…
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 2 కోట్లు అందజేసినట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి అల్లు అరవింద్ అడిగి తెలుసుకున్నారు. నటుడు అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు అందజేసినట్లు తెలిపారు. చెక్కులను ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అందజేశారు.
దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్‌తో కలిసి ఆస్పత్రికి వెళ్ళిన అల్లు అరవింద్, బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని బాలుడు త్వరలోనే ఆరోగ్యవంతుడు అవుతాడని తెలిపారు. నిన్నటితో పోలిస్తే నేడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినట్లు దిల్ రాజు తెలిపారు. సినీ ప్రముఖలతో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమై జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తామన్నారు. తాను చిత్ర పరిశ్రమ వ్యక్తినని, ఇండస్ట్రీ- ప్రభుత్వం మధ్య వారధిగా ఉండాలని సీఎం తనకు ఎఫ్డీసీ బాధ్యత ఇచ్చారని అన్నారు.