ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు మహిళలకు రూ.2100 చొప్పున నగదు ఇస్తామంటూ ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అనే పథకాన్ని మొదలుపెట్టినట్లు ప్రచారం చేసుకుంటోంది. అయితే ఆ ప్రచారాన్ని నమ్మవద్దంటూ ఢిల్లీ ప్రభుత్వపు మహిళా శిశు సంక్షేమ శాఖ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దాంతో ఆ పథకం పేరిట ఏ మోసాలు జరుగుతున్నాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్న సంగతి మీడియా కథనాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ఢిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టికి వచ్చింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంత్రిత్వశాఖ జాతీయ దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ద్వారా….
‘‘ఢిల్లీ ప్రభుత్వం అలాంటి పథకం దేన్నీ నోటిఫై చేయలేదు. ఉనికిలో లేనేలేని పథకానికి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులను ఆమోదించడం అన్న ప్రశ్నే తలెత్తదు. ఆ పథకం పేరుమీద ఎవరైనా ప్రైవేటు వ్యక్తి లేక ఏదైనా రాజకీయ పార్టీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటే అది కచ్చితంగా మోసమే. ఎవరికీ అలా సమాచారాన్ని సేకరించే అధికారం లేదు’’ అని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన, సంజీవని స్కీమ్ పేరుతో ప్రకటనలు ఢిల్లీ అంతటా కనిపిస్తున్నాయి. ఆ పథకాల ప్రకారం అర్హులైన మహిళలను గుర్తించి వారికి రూ.2100 నగదు ఇస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే అసలు అవి ఢిల్లీ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు కావు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన నకిలీ ప్రకటనలు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో, సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉపయోగపడే కేంద్రప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ అమలును అడ్డుకున్నాడు.
ముఖ్యమంత్రి పథకం పేరిట వివరాలు అడుగుతూ ఎవరైనా వస్తే వారికి ఎలాంటి సున్నితమైన సమాచారమూ ఇవ్వవద్దంటూ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో చెప్పింది. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్లు, ఓటర్ ఐడీ సమాచారం, ఆధార్ నెంబర్ల వంటి వివరాలు ఎవరికీ చెప్పవద్దని స్పష్టం చేసింది. అలాంటి సమాచారం బైటకు వెడితే సైబర్ మోసాలు, ఆర్థిక మోసాల ఉచ్చులో పడే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రభుత్వం ఒకవేళ ఏదైనా పథకం పెడితే, దాన్ని అమలు చేయడానికి అధికారికంగా వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేస్తుందని దానిగురించి తామే విస్తృతంగా ప్రచారం చేస్తామనీ స్పష్టం చేసింది.
ఈ ప్రకటనతో రాజకీయ వివాదం చెలరేగింది. ఢిల్లీ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ బీజేపీ నేత కపిల్ మిశ్రా మండిపడ్డారు. మహిళా శిశుసంక్షేమ శాఖ నోటీసును తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేస్తూ ఆయన ఇలా రాసుకొచ్చారు. ‘‘ఢిల్లీలోని సోదరీమణులను భారీగా మోసం చేస్తున్నాడు కేజ్రీవాల్. ఒకవైపు కేజ్రీవాల్ మహిళలతో ఫారాలు నింపిస్తున్నాడు, మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ పత్రికల్లో జారీచేసిన నోటీసులను గమనించండి. అసలు అలాంటి పథకమేదీ లేదనీ, ఆ ఫారాలన్నీ నకిలీవనీ ఢిల్లీ ప్రభుత్వమే ప్రకటిస్తోంది’’ అని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆప్ తన రాజకీయ లబ్ధి కోసం మహిళల ఆకాంక్షలను అవకాశంగా వాడుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
బీజేపీ ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ కొట్టిపడేసారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ‘మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన’ పథకాలతో ప్రత్యర్థులు తీవ్రంగా దెబ్బతిన్నారని వ్యంగ్యంగా అన్నారు. ‘‘రాబోయే రోజుల్లో ఫేక్ కేసు పెట్టి ఆతిషీజీని అరెస్ట్ చేసేయాలని బీజేపీ వారు కుట్ర పన్నారు. దానికంటె ముందు ఆప్ సీనియర్ నాయకుల ఇళ్ళలో సోదాలు జరుగుతాయని ఆరోపించారు.
ఢిల్లీ మహిళా శిశుసంక్షేమ శాఖ, తాము పారదర్శకంగా, ప్రజా భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రజలకు హామీ ఇచ్చింది. మోసపూరిత చర్యల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలంటూ పౌరులకు సలహా ఇచ్చింది. ఏదైనా అధికారిక పథకం గురించి చెప్పాల్సి వస్తే గుర్తించిన ప్రభుత్వ మార్గాల ద్వారా మాత్రమే ప్రకటిస్తామనీ, అలా మాత్రమే దరఖాస్తుదారుల సమాచార భద్రతకు పూర్తి హామీ ఉంటుందనీ వివరించింది.