బిహార్ విద్యాశాఖలో చిత్రవిచిత్రాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గర్భిణీగా గుర్తించి మాతృత్వపు సెలవు (మెటర్నిటీ లీవ్) మంజూరు చేసారు. ఆ వింత సంఘటన వైశాలి జిల్లా హాజీపూర్ మహువా బ్లాక్‌లోని హసన్పూర్ ఓస్తీ హైస్కూల్లో చోటు చేసుకుంది.
జితేంద్ర కుమార్ సింగ్ అనే ఉపాధ్యాయుడు గర్భం కారణంగా సెలవులో ఉన్నాడు. ఆ విషయం నోటి మాటగా కాదు, రాష్ట్ర విద్యాశాఖ అధికారిక వెబ్‌పోర్టల్ ఇ-శిక్షాకోశ్లో నమోదైంది. ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను ఆ పోర్టల్‌లో నమోదు చేసే వ్యవస్థ ఈ యేడాది నవంబర్‌లో మొదలైంది. అప్పటినుంచీ ఆ ఉపాధ్యాయుడు సెలవులోనే ఉన్నారు. ఆ టీచర్ డిసెంబర్ నెల అటెండెన్స్ కాలమ్‌లో మెటర్నిటీ లీవ్ అని ప్రస్తావించి ఉంది. ఆయనకు డిసెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకూ సెలవు మంజూరయింది.
ఆ విచిత్రానికి కారణం సాంకేతిక సమస్య అని చెబుతున్నారు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అర్చనా కుమారి. ‘‘జితేంద్ర కుమార్ సింగ్ పేరును పొరపాటున వెబ్‌పోర్టల్‌లో కలిపాము. దాన్ని త్వరలోనే తొలగిస్తాం. ఆ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ఆయన సెలవు తప్పు కేటగిరీలో పడింది. ఇంకా, మహిళా టీచర్లు దరఖాస్తు చేసుకునే క్యాజువల్ లీవ్‌లను సైతం ఎర్న్డ్ లీవ్‌లుగా చూపిస్తోంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించాక, తగిన చర్యలు తీసుకుంటాం. మగ టీచర్లకు కూడా 15 రోజుల సెలవులు ఉన్నాయి, కానీ వాటి కేటగిరీ వేరు’’ అని అర్చనా కుమారి వివరించారు.
మగ టీచర్‌కు మెటర్నిటీ లీవ్ ఇచ్చిన వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది. బిహార్‌లో ఉద్యోగినులకు మెటర్నిటీ లీవ్ 180 రోజులు, అంటే దాదాపు సగం సంవత్సరం, ఇస్తారు. ప్రభుత్వోద్యోగులకైతే ఇద్దరు పిల్లల వరకూ మాతృత్వ సెలవులు వాడుకోవచ్చు.