సిపిఎం సర్కారు సహకార బ్యాంకుల నిర్వహణలో మోసం కేరళలో మరొక పెట్టుబడిదారు ప్రాణాలు తీసింది. ఇడుక్కి జిల్లాలో సిపిఎం నియంత్రణలో ఉన్న కట్టప్పన గ్రామీణాభివృద్ధి సహకార సొసైటీలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. 53ఏళ్ళ సాబు కట్టప్పన పట్టణంలో ఒక ఫ్యాన్సీ స్టోర్ నిర్వహించేవాడు. సహకార సొసైటీలో తాను డిపాజిట్ చేసిన సొమ్మును రికవరీ చేసుకోడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం అవడంతో గత్యంతరం కనబడక నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.
అత్యవసర విజ్ఞప్తులకూ ‘సహకారం’ సున్నా:
సాబు కట్టప్పన సహకార బ్యాంకులో రూ.35లక్షలు డిపాజిట్ చేసాడు. అందులో అతను కేవలం రూ.14లక్షలు మాత్రమే రికవరీ చేసుకోగలిగాడు. మిగతా మొత్తం కోసం అతను ఎన్నిసార్లు అభ్యర్ధించినా సంబంధిత అధికారులు నిరాకరించారు. బ్యాంకు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున డబ్బులు ఇవ్వలేకపోతున్నామంటూ ఎగవేసారు. చివరిసారి డిసెంబర్ 20న సాబు బ్యాంకుకు వెళ్ళాడు. అతని భార్య మేరీకుట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం పెద్దమొత్తంలో డబ్బులు కావాలి.
తన డబ్బులు తీసుకోవడం కోసం బ్యాంకు ఉద్యోగులను సహాయం అడిగిన ప్రతీసారీ సాబూకు అవమానం, తిట్లు, దూషణలే ఎదురయ్యాయని భార్య మేరీకుట్టి స్పష్టం చేసింది. సాబు ఆత్మహత్యకు ముందు రాసిన ఆఖరి లేఖలో తన మరణానికి కారణం బ్యాంకు కార్యదర్శి రెజీ, ఉద్యోగులు సుజామొల్, బినొయ్ అని రాసాడు. ఆ లేఖలో, వారు తనను అవమానించారని, భౌతికంగా నెట్టిపడేసారని, నోటికొచ్చిన బూతులు తిట్టారనీ సాబు ఆవేదన చెందాడు. తన దుర్గతి ఎవరికీ పట్టకూడదంటూ సాబు రాసిన లేఖ చూపరులకు కన్నీళ్ళు పెట్టిస్తోంది.
ఈ సంఘటన కట్టప్పన పరిసర ప్రాంతాల్లో తీవ్ర నిరసనలకు దారితీసింది. సాబుకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ, కాంగ్రెస్, స్థానిక వాణిజ్య వర్తక సంఘాల వారూ బ్యాంకు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. డిసెంబర్ 20న బీజేపీ, కాంగ్రెస్‌లు పిలుపునిచ్చిన కేరళ హర్తాళ్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల నిర్వహణలో కేరళ సర్కారు జవాబుదారీగా వ్యవహరించాలని వారు నిలదీసారు.
నిరసనకారులు మొదట సాబు శరీరాన్ని బ్యాంక్ ఆవరణ నుంచి బైటకు తీసుకొచ్చారు. అతను తన సూసైడ్ నోట్లో పేర్కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసారు. పోలీసులు ఎట్టకేలకు ఆ డిమాండ్‌కు ఒప్పుకోవలసి వచ్చింది.
సహకార బ్యాంకు మోసాల్లో ఒక నమూనా:
కేరళను కుదిపేస్తున్న సహకార బ్యాంకు మోసాల్లో కట్టప్పన కేసు తాజా వ్యవహారం. రూ.300 కోట్ల విలువైన కరువన్నూర్ బ్యాంక్ మోసం కేసు కేరళ సహకార బ్యాంకింగ్ రంగంలో వ్యవస్థాగత లోపాలకు తార్కాణంగా నిలిచింది. తాజాగా సాబు ఆత్మహత్య, కమ్యూనిస్టు ప్రభుత్వపు ఆర్థిక నిర్వహణలో అవకతవకలు, సహకార వ్యవస్థల్లో మోసాల వల్ల కలిగే దుష్ఫలితాలకు హెచ్చరిక.