టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయాలు
శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు గాను
ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని అందుకు ఏపీ డిజిటల్ కార్పోరేషన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది.
తిరుమలలోని బిగ్ , జనతా క్యాంటిన్ ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారీకి గాను దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీ చేసే విధానానికి ఆమోదం తెలిపింది.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు అధ్యక్షతన, ఈవో జె.శ్యామలరావు ఆధ్వర్యంలో తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు ….
టీటీడీ ఆలయాలు, ఆస్తుల GLOBAL EXPANSION కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం.
దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటు. స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
నడకదారి ద్వారా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకుగాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం.
తిరుమల అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు SLSMPC ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం.
సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ పోస్టును SLSMPC కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం.