జమ్మూకశ్మీర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. సైనికులు విధి నిర్వహణలో భాగంగా ఓ చోటు నుంచి మరో స్థావరానికి వెళుతుండగా వాహనం లోయలో పడింది. దీంతో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం 350 అడుగుల లోతులో పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీ (11 ఎంఎల్ఐ)కి చెందినది. నీలం హెడ్‌క్వార్టర్స్ నుంచి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 11 ఎంఎల్ఐ క్విక్ రియాక్షన్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.