భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజపేయీ. ఇవాళ ఆయన శతజయంతి. సరిగ్గా వందేళ్ళ క్రితం ఇదేరోజు అంటే 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పుట్టారు. 15ఏళ్ళ వయసులో ఆర్ఎస్ఎస్లో స్వయంసేవక్‌గా చేరారు. 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి ప్రచారక్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ ఆదేశం మేరకు 1951లో కొత్తగా పెట్టిన భారతీయ జనసంఘ్ పార్టీలో పనిచేయడం ప్రారంభించారు.
వాజపేయీ గొప్ప వాక్చాతుర్యం, వాగ్ధాటి కలిగిన నాయకుడు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు విని, మన దేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సైతం అభినందించారు. ఆయన 1957లో మొదటిసారి ఎంపీ అయ్యారు. అప్పటినుంచీ పార్లమెంటులో తన వాణి వినిపిస్తూనే ఉన్నారు. వాజపేయీ ఎంత గొప్ప వక్త అంటే, పార్లమెంటులో ఆయన ప్రసంగం విన్న నెహ్రూ, నువ్వు తప్పక ప్రధానమంత్రివి అవుతావు అని ప్రశంసించారు.
1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు అరెస్ట్ చేసిన కీలక నేతల్లో వాజపేయీ ప్రధానమైన వారు. 1977లో ఎమర్జెన్సీ తొలగించాక అదే యేడాది ప్రతిపక్షాలన్నీ కలిసి జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసాయి. అందులో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాగా వాజపేయీ విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసారు. ఆ హోదాలోనే వాజపేయీ 1977లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో హిందీలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు ఆయన. 1979లో జనతా పార్టీ కూటమి ప్రభుత్వానికి వాజపేయీ రాజీనామా చేసారు. 1980లో జనసంఘ్ కాస్తా భారతీయ జనతా పార్టీగా మారింది.
వాజపేయీ నేతృత్వంలో బీజేపీ హిందూ జాతీయవాద సిద్ధాంతంతో పాటు గాంధేయ సామ్యవాదానికి కూడా మద్దతిస్తూ రాజకీయ పార్టీగా ఎదిగింది. మరో ప్రముఖ నాయకుడు లాల్ కృష్ణ ఆఢ్వాణీతో కలిసి వాజపేయీ బీజేపీ ఎదుగుదలకు కృషి చేసారు.
1996లో జరిగిన ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగింది. వాజపేయీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసారు. అయితే మెజారిటీకి కావలసినంత మంది సభ్యులు లేకపోవడంతో ఆ ప్రభుత్వం 16 రోజుల్లోనే కూలిపోయింది.
తర్వాత 1998లో వాజపేయీ రెండోసారి ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసారు. మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన ఆ సంకీర్ణ ప్రభుత్వం ఈసారి రెండేళ్ళ పాటు నడిచింది. 13 నెలలు పరిపాలన చేసాక 1999లో ప్రభుత్వం మళ్ళీ కూలిపోయింది. అయితే ప్రతిపక్షం సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేకపోవడంతో పార్లమెంటు రద్దయిపోయింది. ఫలితంగా మళ్ళీ 1999లోనే ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్ళూ పూర్తిగా పరిపాలించింది. అలా వాజపేయీ మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసారు.
వాజపేయీ ప్రధానిగా ఉండగానే 1998లో పొఖారన్ – 2 పరమాణు పరీక్షలు జరిగాయి. భారత పాక్ సంబంధాలు మెరుగు పడడానికి 1999లో లాహోర్ బస్సు యాత్ర చేసారు. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా పాకిస్తాన్ ప్రధానిని భారతదేశానికి ఆహ్వానించారు. వాజపేయి ప్రధానిగా ఉండగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల సంస్కరణలూ తీసుకొచ్చారు. ఆయనకు 1992లో పద్మవిభూషణ్ పురస్కారం వచ్చింది.
నరేంద్రమోదీ ప్రభుత్వం 2014లో వాజపేయీ పుట్టినరోజైన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా ప్రకటించింది. 2015లో ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసారు. దేశం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు వాజపేయీ.