మహిళల క్రికెట్ పోటీలో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ లో సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను కూడా భారత మహిళల జట్టు సొంతం చేసుకుంది. నేడు వడదొర వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో విండీస్ 46.2 ఓవర్లకు 243 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 115 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది.
విండీస్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ 99 బంతులు ఆడి శతకం కొట్టింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఏ మాత్రం వెరవకుండా ఆడి సెంచరీ చేసింది. మరో ఓపెనర్ క్వినా జోసెఫ్ మాత్రం 16 బంతుల్లో 15 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది. దీంతో స్కోర్ బోర్డు 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు వెస్టిండీస్ తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత 36పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. నెరిస్రా క్రాఫ్టన్ (13) టిటాస్ సాధు బౌలింగ్ లో ఆమెకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత రషీదా విలియమ్స్ డకౌట్ గా ప్రియా మిశ్రా బౌలింగ్ లో ఔట్ కావడంతో విండీస్ పై తీవ్ర ప్రభావం పడింది. డియాండ్రా డాటిన్ (10) వికెట్ ను రేణుకా తన ఖాతాలో వేసుకుంది. వీకెట్ కీపర్ షెమైన్ (38) ను టిటాస్ సాధు ఔట్ చేయడంతో 181 పరుగుల వద్ద విండీస్ ఐదో వికెట్ నష్టపోయింది.
ఆ తర్వాత వెంటవెంటనే ఆరు, ఏడు వికెట్లు కోల్పోయింది. ఆలీయా అలీన్(0), మాథ్యూస్ (106) వెనుదిరగడంతో ఏడువికెట్ల నష్టానికి 39 ఓవర్లకు గాను 199 పరుగులు చేసింది. ఆ తర్వాత జైదా జేమ్స్ (25), అఫై ఫ్లెచర్ (22) పోరాడారు. కరిష్మా పదో వికెట్ గా వెనుదిరగడంతో 243 పరుగులు వద్ద వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
భారత బౌలర్లలో ప్రియా శర్మ మూడు వికెట్లు తీయగా, ప్రతికా రావల్, టిటాస్ సాధు, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.