నాలుగు రోజుల క్రితం, అంటే డిసెంబర్ 20న జర్మనీలోని మాగ్దెబర్గ్‌లో సందడిగా ఉన్న క్రిస్మస్ మార్కెట్ మీద దాడి జరిగింది. సౌదీ అరేబియా నుంచి వెళ్ళిన డాక్టర్, 50ఏళ్ళ తాలెబ్ అల్ అబ్దుల్‌మొహిసిన్ అనే వ్యక్తి ఒక బీఎండబ్ల్యూ కారును మార్కెట్లో జనాల మీదకు ఎక్కించేసాడు. ఆ ఘటనలో ఐదుగురు చనిపోయారు, 200మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
క్రైస్తవులకు క్రిస్మస్ అనేది సంతోషం, ఆశ, దాతృత్వానికి నిదర్శనంగా నిలిచే పండుగ. ఆ సమయంలో పెద్దసంఖ్యలో క్రైస్తవులు వేడుకలు జరుపుకోడానికి బైటకు వస్తారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాద దాడులు చేయడం, ప్రజలను భయభ్రాంతులను చేయడం, సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేయడం పరిపాటిగా మారింది. ప్రత్యేకించి, క్రైస్తవానికి దాయాది మతమైన ఇస్లాం అనుయాయులే అలాంటి దాడులకు పాల్పడుతుండడం గమనార్హం.
2013 నుంచి 2024 వరకూ పుష్కరకాలంలో క్రిస్మస్ వేడుకల సమయంలో జరిగిన 11 ప్రధాన ఉగ్రవాద దాడులను ఒక్కసారి పరికిద్దాం…
(1) 2024-జర్మనీ: మాగ్దెబర్గ్‌లో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి:
డిసెంబర్ 20న సౌదీ జాతీయుడు, జర్మనీలో 2006 నుంచీ నివసిస్తున్న సైకియాట్రిస్ట్ అయిన తాలెబ్, ఒక కారును క్రిస్మస్ మార్కెట్ మీదకు విచక్షణారహితంగా నడిపాడు. ఆ దాడిలో ఐదుగురు చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు ఆ కారు డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్ చేసారు. తర్వాత ఆ వాహనంలో పేలుడు పదార్ధం దొరకడం గమనార్హం.
దాడికి కారణం తెలుసుకోడానికి జర్మన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాలెబ్ తన సోషల్ మీడియా అకౌంట్లో తనను తాను మాజీ ముస్లింగా, నాస్తికుడిగా పేర్కొన్నాడు. కానీ ఆ ఉనికే అతని మీద పలు అనుమానాలకు తావిస్తోంది. మాజీ ముస్లిముల సమూహ సభ్యులు తమ గ్రూపుతో అతనికి ఉన్న సంబంధంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(2) 2023-జర్మనీ: కొలోన్ కెథెడ్రల్ ఉగ్రదాడి కుట్ర
2023 డిసెంబర్ 31న జర్మన్ పోలీసులు వియన్నాలో ముగ్గురు తజకిస్తాన్ జాతీయులను అరెస్ట్ చేసారు. వారికి ‘ఐఎస్ఐఎస్-కె’తో సంబంధాలున్నాయని తేలింది. అది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అప్ఘానిస్తాన్ విభాగం. ఆ గ్రూపు కొలోన్ నగరంలోని కెథెడ్రల్ మీద కొత్తసంవత్సర వేడుకల సమయంలో దాడి చేయడానికి కుట్ర పన్నింది.
(3) 2023-నైజీరియా: క్రిస్మస్ ఊచకోత
గతేడాది డిసెంబర్ 24న నైజీరియా ప్లటూ రాష్ట్రంలోని 21 క్రైస్తవ గ్రామాలపై ఫులానీ అనే మిలిటెంటు సంస్థ సభ్యులు దాడి చేసారు. ఆ దాడిలో 194 మంది చనిపోయారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధ్రువీకరించింది. 32వేలమందికి పైగా జనాలు నిరాశ్రయులయ్యారు. ఇళ్ళను, చర్చిలను తగులబెట్టిన సంఘటనలను నైజీరియన్ రెడ్‌క్రాస్ సంస్థ నమోదు చేసింది.
ఆ హింసాకాండ ప్రధానంగా బొకోస్, బార్కిన్ లడీ, మంగూ అనే కౌంటీల్లో చోటు చేసుకుంది. ఏడుగంటలకు పైగా హింసాకాండ కొనసాగింది. నైజీరియా ఆధునిక చరిత్రలో క్రిస్మస్ సంబంధిత వేడుకలపై అత్యంత దారుణమైన దాడి అదే.
(4) 2023-నైజీరియా: క్రిస్మస్ రోజు బొకోహరామ్ దాడి
2025 డిసెంబర్ 25న ఈశాన్య నైజీరియాలోని ఒక క్రైస్తవ గ్రామంపై బొకో హరాం మిలిటెంట్లు దాడి చేసారు. ఆ దాడిలో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఇళ్ళు తగలబడిపోయాయి. దుకాణాల లూటీ, గృహదహనాలు, ఇళ్ళ ధ్వంసం, తుపాకులు వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెద్దపెద్ద కత్తులతో గాయపరిచారు. చిరకాలంగా బొకోహరాం సంస్థ ఆ ప్రాంతంలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.
(5) 2023-జర్మనీ: క్రిస్మస్ మార్కెట్‌పై దాడికి కుట్ర:
2023 నవంబర్ 28న లెవెర్కుసెన్ నగరంలో క్రిస్మస్ మార్కెట్ మీద వాహనంతో దాడి చేయడానికి కుట్ర పన్నిన ఇద్దరు టీనేజర్లను జర్మన్ అధికారులు అరెస్ట్ చేసారు. వారిలో 15ఏళ్ళ కుర్రవాడు తమ కుట్ర వివరాలను పోలీసులకు వెల్లడించాడు. ఐసిస్ చిహ్నాలతో ఉన్న వీడియోలను చూపించాడు. వారికి నాలుగేళ్ళ జైలుశిక్ష పడింది.
(6) 2020-నైజీరియా: పెమీ గ్రామంపై దాడి
2020 డిసెంబర్ 25న బోర్నో రాష్ట్రంలో పెమీ అనే క్రైస్తవ గ్రామం మీద బొకో హరాం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో వారు కనీసం 11మందిని చంపేసారు. గ్రామంలోని చర్చిని, ఒక ఆస్పత్రిని తగులబెట్టేసారు. క్రిస్మస్ వేడుకల కోసం తెచ్చిన సామాన్లను దోచుకున్నారు.
నైజీరియా ఈశాన్య భాగంలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో బొకోహరాం చేసిన అరాచకాల్లో ఈ దాడి కూడా ఒక భాగం. నైజీరియాలో ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగిన బొకోహరాం ఘర్షణల్లో 36వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
(7) 2019-ఆస్ట్రియా: వియన్నాలో క్రిస్మస్ మార్కెట్‌పై దాడికి కుట్ర
2019 డిసెంబర్ 17న ఆస్ట్రియా అధికారులు భారీ ఉగ్రవాద దాడి కుట్రను భగ్నం చేసారు. వియన్నాలోని క్రిస్మస్ మార్కెట్‌ను, ఆ తర్వాత యూరోప్‌లోని పలు ప్రదేశాలనూ వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ కుట్రలో ముగ్గురు చెచెన్ యువకులను అరెస్ట్ చేసారు. వారికి నాయకత్వం వహించిన 24ఏళ్ళ యువకుడు అంతుముందు ఐసిస్‌లో చేరడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఒకసారి జైలుకు వెళ్ళివచ్చాడు.
(8) 2016-జర్మనీ: బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి
2016 డిసెంబర్ 19న అనీస్ అమీరీ అనే ట్యునీసియా జాతీయుడు బెర్లిన్‌లోని బ్రెయిట్షెడ్ప్లట్జ్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో ప్రజలను ట్రక్కుతో గుద్దేసాడు. ఆ దుర్ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. అనీస్ అమ్రీ ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసాడు. అతివాద ముస్లిములతో సంబంధాలు ఉన్నందున అతనిపై నిఘా కూడా ఉండేది. ఆ దాడి జర్మనీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అమీరీ కార్యకలాపాల గురించి ముందుగానే హెచ్చరికలు ఉన్నా పట్టించుకోని భద్రతా లోపాలను బైటపెట్టింది.
(9) 2015-అమెరికా: శాన్ బెర్నార్డినో హాలిడే పార్టీపై దాడి
2015 డిసెంబర్ 2న సయ్యద్ ఫరూక్, తెహస్ఫీన్ మాలిక్ అనే ఇద్దరు, ఇస్లామిక్ అతివాదంతో ప్రేరేపితులై దాడికి పాల్పడ్డారు. కాలిఫోర్నియా శాన్ బెర్నార్డినోలో ఒక వర్క్‌ప్లేస్ హాలిడే పార్టీపై దాడి చేసి 14మందిని చంపేసారు. ఐసిస్ ప్రచారానికి ఆకర్షితులైన యువకులు ఆ దాడికి పాల్పడ్డారు. వారింకా పలుచోట్ల బాంబులతో దాడులు చేయాలని ప్రణాళిక రచించుకున్నారు కూడా.
(10) 2014-ఫ్రాన్స్: దిజోన్ వాహన దాడి
2014 డిసెంబర్ 22న ఫ్రాన్స్‌లోని దిజోన్ నగరంలో క్రిస్మస్ షాపింగ్ చేస్తున్న ప్రజలను ఒక వ్యక్తి వాహనంతో గుద్దేసాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేసాడు. ఆ దాడిలో 11మంది గాయపడ్డారు. అధికారులు ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు. కానీ ఆ సంఘటన ఫ్రాన్స్‌లో ముస్లిములు పాల్పడిన దాడుల వరుసలోనిది కావడం గమనార్హం.
(11) 2013-ఇరాక్: బాగ్దాద్ పేలుళ్ళు
2013 డిసెంబర్ 26న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రెండు కారు బాంబులు పేలాయి. అవి ప్రత్యేకించి క్రైస్తవులనే లక్ష్యంగా చేసుకుని పేల్చబడ్డాయి. ఆ దాడుల్లో 38మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి పేలుడు ఒక చర్చ్ బైట జరిగింది, రెండో పేలుడు చర్చ్ దగ్గరలో ఉన్న మార్కెట్లో చోటు చేసుకుంది. ఇరాక్‌లో జాతుల ఘర్షణలో ఇరుక్కుపోయిన క్రైస్తవుల దయనీయ పరిస్థితికి ఆ దాడులు నిదర్శనం.
వేర్వేరు సంవత్సరాల్లో వేర్వేరు దేశాల్లో వేర్వేరు ఖండాల్లో జరిగిన ఈ దాడులను గమనిస్తే ఉగ్రవాద సంస్థలు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని, వారి పండుగ సమయంలో దాడులు చేస్తున్నాయని అర్ధమవుతుంది. ఇప్పటికీ మితిమీరిన ఉదారవాదంతో ముస్లిం దేశాల నుంచి శరణార్థులుగా వస్తున్న వారికి ఆశ్రయమిచ్చి తలనొప్పులు కొని తెచ్చుకుంటున్న పాశ్చాత్య ప్రపంచానికి తాజా జర్మనీ దాడితో మరో పాఠం. కానీ అలాంటి గుణపాఠాలు నేర్చుకోడానికి వారు సిద్ధంగా ఉన్నారా అన్నదే అసలైన ప్రశ్న.