తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజూ 70 వేల మందికిపైగా భక్తులు దర్శించుకుంటున్నారు. వారికి ఉచితంగా అన్నదానం చేయడంతోపాటు, ప్రసాదాలు అందిస్తున్నారు. వీటి నాణ్యతను సాంకేతికంగా ప్రతి రోజూ పరీక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ విభాగంలో నిపుణులైన అధికారులను నియమించి ప్రతి రోజూ ఆహారం శాంపిల్స్ తీసుకుని ల్యాబులో పరీక్షిస్తారు. ఇందుకు భక్తుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు.
నవీ ముంబైలో 10 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, 3 ఎకరాల్లో అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతోంది. త్వరలో పనులు పూర్తి కానున్నాయని టీటీడీ ఈవో చెప్పారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు సరిపడినన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఒంటిమిట్ట కోదండరామాలయం గోపురానికి బంగారు తాపడం చేయించాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో భక్తులకు చౌకగా, నాణ్యమైన ఆహారం అందించే రెస్టారెంట్లను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో పేరున్న వెజ్ రెస్టారెంట్లకు భవనాలు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో కొన్ని హోటళ్లు ఏర్పాటు చేసినా వారు అత్యధిక ధరలకు విక్రయించడం, నాణ్యత లేకుండా ఆహారం సరఫరా చేయడంతో వాటిని సీజ్ చేశారు. కొత్తగా నిబంధనలు కఠినంగా తయారు చేసి పేరున్న రెస్టారెంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నారు.