తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సనాతనులు
సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే కొన్ని శక్తులు తిరుపతి వేదికగా చెలరేగిపోతున్నాయి. తిరుమల కొండలపై అన్యమత ప్రచారానికి పాల్పడి దొరికిపోయిన ఘటనలు గతంలో చాలా బయటపడ్డాయి. ఇటీవల తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో ఓ ఆచార్యుడే మతబోధకుడి అవతారమెత్తగా విద్యార్థులు తగిన బుద్ధి చెప్పారు. తాజాగా మరో పైశాచికానికి పాల్పడ్డారు. వాగ్గేయకారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య స్వామి విగ్రహానికి క్రిస్మస్ టోపీ పెట్టారు.
ఆర్ సి రోడ్డు సెంటర్ లోని శ్రీ అన్నమాచార్యులవారి విగ్రహానికి క్రిస్మస్ టోపీ పెట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే తొలగించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కావాలనే సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలకు పాల్పడి మతవివాదాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు.
సనాతన ధార్మిక క్షేత్రం తిరుపతిలో పదకవితా పితామహుడైన అన్నమయ్యకు అపచారం చేసిన వారిని వదలిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను క్రైస్తవ మత పెద్దలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.