పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబరు 5వ తేదీన హైదరాబాద్ సంధ్యా థియోటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన ఘటనలో నమోదైన కేసు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ, సీఐ అల్లు అర్జున్ను మూడు గంటలపాటు విచారించారు. ఘటన జరిగిన విషయంలో అనేక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ సమాధానాలను రికార్డు చేశారు.
తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన విషయాన్ని పోలీసు అధికారులు చెప్పినా, తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పడంపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మహిళ చనిపోయిన విషయం తనకు తరవాత రోజు వరకు తెలియదని ఓ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పారు. ఆయన మాట్లాడిన దానిపై కూడా పోలీసులు కూపీ లాగారు.
బౌన్సర్లపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియోటర్ వద్ద ప్రేక్షకులను నెట్టిపడేసిన బౌనర్లను అరెస్ట్ చేశారు. మరికొందరు కోసం గాలిస్తున్నారు. సంతోష్ అనే వ్యక్తి రేవతి చనిపోయిన విషయం థియోటర్లో అల్లు అర్జున్‌కు కానిస్టేబుల్ చెప్పే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాడనే దానిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి అల్లు అర్జున్ విచారణ పూర్తైంది. నటుడు అల్లు అర్జున్ను సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియోటర్ వద్దకు తీసుకెళతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అల్లు అర్జున్ (pushpa 2 allu arjun) తన న్యాయవాదులను తీసుకెళ్లినా పోలీసులు అనుమతించలేదు.