తమిళనాడులోని తిరుపోరూర్ కందస్వామి దేవాలయంలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు జారి హుండీలో పడిపోయింది. దాన్ని తీసి ఇవ్వడం కుదరదంటూ దేవదాయ శాఖ అధికారులు తెగేసి చెప్పారు. దాంతో ఆ భక్తుడు లబోదిబోమంటున్నాడు.
వినాయగపురానికి చెందిన దినేష్ అనే భక్తుడు డిసెంబర్ 20న కందస్వామి గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. దర్శనం, పూజ పూర్తయాక హుండీలో దక్షిణ వేసే క్రమంలో అతని చొక్కా జేబులోని ఐఫోన్ జారి హుండీలో పడిపోయింది. కంగారు పడిన దినేష్, దేవాలయ అధికారులకు విషయం చెప్పాడు. తన ఫోన్‌ను వెనక్కి ఇప్పించాలని కోరాడు. అయితే, హుండీని వెంటనే తీయడం కుదరదని, ఒకవేళ తీసినా, అందులో ఉన్న వస్తువులు స్వామివారికే చెందుతాయి కాబట్టి ఫోన్ వెనక్కి ఇవ్వబోమనీ చెప్పారు.
దేవాలయ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఆ గుడిలో హుండీ రెండు నెలలకు ఒకసారి తీస్తారు. దానికి సంక్లిష్టమైన అధికారిక ప్రక్రియ ఉంటుంది. అందువల్ల మళ్ళీ హుండీ తెరిచేవరకూ వేచి ఉండాలని చెప్పారు. అంతే కాదు, అసలు హుండీలో పడిన వస్తువును వెనక్కి ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
దినేష్ కుటుంబం విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు అదేరోజు హుండీ తెరిచారు. అందులోనుంచి దినేష్ ఐఫోన్ బైటకు తీసారు. అయితే అధికారులు తమ నియమాలకే కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ‘‘తెలిసి వేసినా, ప్రమాదవశాత్తూ పడిపోయినా హుండీలో ఉన్న వస్తువులు అన్నింటినీ స్వామివారి సొత్తుగా భావించడం సంప్రదాయం. ఆ ఫోన్ ఇప్పుడు ఆలయ నిర్వాహకుల కస్టడీలో ఉంది. ఫోన్ పొరపాటున జారిపడిందా లేక భక్తుడు ముందు ఫోన్‌ను హుండీలో వేసి, తర్వాత తన నిర్ణయం మార్చుకున్నాడా అన్న సంగతి మాకు తెలియదు కదా’’ అని ఆలయం ఈఓ కుమరవేల్ చెప్పుకొచ్చారు.
దేవాలయం అధికారులు ఆ ఫోన్లోని సిమ్‌కార్డును దినేష్‌కు వెనక్కిచ్చేసారు. కానీ ఫోన్ మాత్రం ఆలయం ఆస్తిగానే ఉంటుందని చెప్పారు. ఆ విషయంలో తామేమీ చేయలేమనీ, ఉన్నతాధికారులను సంప్రదించమనీ సలహా ఇచ్చారు.
తమిళనాడు దేవదాయ శాఖ ఈ విషయంలో ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతోంది. ఆ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు ‘‘హుండీలో వేసే వస్తువులన్నీ స్వామివారికే చెందుతాయన్నది సంప్రదాయం. అయితే ఈ కేసులో చట్టపరంగా ఏమైనా మినహాయింపు ఇచ్చే మార్గం ఉందా అన్నది తెలుసుకుంటాం’’ అని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఉండే చట్టపరమైన, విధానపరమైన సంక్లిష్టతలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై అధికారులు చర్చిస్తున్నారు.
ఈ వ్యవహారంలో దేవదాయ శాఖ నియమ నిబంధనల మీద సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో అధికారులు పట్టువిడుపుల ధోరణితో వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.