‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం వచ్చే నెల 8న జరగనుంది. కమిటీ ఛైరపర్సన్తోపాటు సభ్యులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశం అజెండా వివరాలను కేంద్ర న్యాయ శాఖ కమిటీ సభ్యులకు తెలియజేయనుంది.
129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జనవరి 8న ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని జేపీసీ కమిటీ జాయింట్ సెక్రెటరీ గుండా శ్రీనివాసులు తెలిపారు.
జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సాధ్యాసాధ్యాలను సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీకి రాజస్థాన్ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వం వహించనున్నారు.
జమిలి ఎన్నికల కోసం 39 మందితో ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలో 12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఏపీ నుంచి వైసీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సభ్యులుగా ఉన్నారు.