నిద్ర నటిస్తున్న వాణ్ణి లేపడం కష్టం. వాడి మంచానికి నిప్పు అంటుకున్నప్పుడు ఆ మంటలను పట్టించుకోకుండా ఉండడం సాధ్యం కాదు. అయినా అమాయకంగా తనకు ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోతాడు. అప్పుడే నిద్ర లేచినట్లు, మంటల్ని అప్పుడే చూసినట్లూ నటిస్తాడు. కేరళలో సిపిఎం పరిస్థితి అదే. ఏళ్ళ తరబడి మౌనంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు ఇస్లామిక్ రాజకీయ లాబీని వేలెత్తి చూపుతోంది. వయనాడ్‌లో రాహుల్, ప్రియాంకా గాంధీల విజయం వెనుక ముస్లిం రాజకీయ లాబీ కీలక పాత్ర ఉందని మొత్తుకుంటోంది.
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ విజయరాఘవన్ ఇటీవల ఒక ప్రకటన చేసారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభా నియోజకవర్గంలో గెలవడానికి కారణం ఇస్లామిక్ మతతత్వ శక్తుల మద్దతు స్వీకరించడమేనని ఆరోపించారు. ప్రియాంక ఎన్నికల ప్రచారంలో ఆమె ముందు, వెనుక ఉన్నవారంతా తీవ్రమైన మతతత్వ శక్తులని మండిపడ్డారు.
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో వయనాడ్ రెవెన్యూ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే లేవు. పొరుగున ఉన్న ముస్లిం మెజారిటీ మలప్పురం రెవెన్యూ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు – ఎరనాడుచ ,నీలాంబర్, వండూర్ – కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోని ముస్లిం ఓటుబ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంది. మలప్పురం రెవెన్యూ జిల్లా ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌కు పట్టు బలంగా ఉన్న ప్రాంతం. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌లో (యుడిఎఫ్) రెండో పెద్ద పార్టీ ముస్లింలీగే. వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక విజయాల వెనుక ఉన్నది ఆ ముఖ్యమైన అంశమే.
ప్రియాంకా గాంధీ వయనాడ్ లోక్‌సభ నుంచి పోటీచేసినప్పుడే పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ స్థానిక పిఎఫ్ఐకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందన్న ఆరోపణలున్నాయి. విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ అభ్యర్ధి విజయాన్ని ప్రకటించాక ఆ పార్టీ స్థానికంగా సంబరాలు జరుపుకుంది. అంటే, వయనాడ్‌లో అనుసరించినటువంటి ఓటింగ్ ప్యాట్రన్‌నే అనుసరించిందని ధీమాగా చెప్పవచ్చు.
ఆ విషయాన్ని సిపిఎం నాయకుడు స్వయంగా ప్రస్తావించడం విశేషం. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)… రెండు కూటములూ ముస్లిం ఓటర్లను ఆకట్టుకోడానికి తీవ్రంగా పోటీ పడతాయి. ఆ నేపథ్యంలో విజయ రాఘవన్ ప్రకటన విమర్శలకు తావిచ్చింది. ‘‘ముస్లిం మతస్తుల ఓటుబ్యాంకును ఎల్‌డిఎఫ్ దక్కించుకుంటే అది ‘ఎలీట్ ఓటింగ్’, అదే ఎల్‌డిఎఫ్ తలచుకుంటే అది మతతత్వం అవుతుంది’’ అని విజయ రాఘవన్ వ్యాఖ్యానించాడు.