ఝార్ఖండ్ సరిహద్దు జిల్లాల్లో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లోహార్డాగా, సాహిబ్‌గంజ్, పకూర్, గఢ్వా, లాతేహార్ వంటి జిల్లాల్లో ఆధార్ కార్డుల రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేసుకున్నవారి సంఖ్య, స్థానిక జనాభా కంటె చాలా ఎక్కువగా ఉంది. ఈ సమాచారం, ప్రభుత్వ పాలనలోని లోపాలను పట్టిస్తోంది.
ఆధార్ కార్డులను నిర్వహించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) సమాచారం ప్రకారం ఝార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో ఆదార్ ఎన్రోల్మెంట్లు ఆయా జిల్లాల జనాభా కంటె ఎక్కువ ఉన్నాయి. ఆ సమాచార వివరాలు వ్యవస్థలోని అవకతవకలను సూచిస్తున్నాయి. గుర్తింపు తనిఖీ ప్రక్రియ మీదనే అనుమానాలు కలిగిస్తున్నాయి.
చొరబాట్లకు సాక్ష్యాధారాలు:
ఇటీవలి తనిఖీలను పరిశీలిస్తే ఝార్ఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్‌కు చేరువలో ఉన్న సాహిబ్‌గంజ్, పాకూర్ జిల్లాల్లో చొరబాట్లు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితిని కళ్ళకు కడుతున్నాయి. ఇంటలిజెన్స్ బ్యూరో బృందం, ఇంటర్నల్ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా డిసెంబర్ 15 నుంచి 18 వరకూ నాలుగు రోజుల పాటు సాహిబ్‌గంజ్ జిల్లాలో దర్యాప్తు చేసింది. వారి పరిశోధనలో, భారత్‌లోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులు మోసపూరిత విధానాల్లో ఆధార్ కార్డులను పొందుతున్నట్లు నిరూపించడానికి సరిపడినన్ని సాక్ష్యాధారాలు లభించాయి. దుమ్కా జిల్లాలో ఎనిమిది మంది వ్యక్తుల ఆధార్ కార్డుల్లో తౌఫుల్ బీబీ అనే ఒకే మహిళ తల్లిగా ఉంది. ఆ ఎనిమిది మందికీ పుట్టిన రోజులు సైతం ఒకటే. ఇలాంటి నకిలీ పత్రాలను గమనిస్తే ఉద్దేశపూర్వకంగా అధికారిక రికార్డులను తప్పుదోవ పట్టించి తప్పుడు కార్డులు జారీ చేస్తున్నారని అర్ధమైపోతుంది.
డాక్యుమెంట్ల మోసాలు:
ఝార్ఖండ్ సరిహద్దు జిల్లాల్లో ఓటర్ల జాబితాలు, బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించి మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటరు రిజిస్ట్రేషన్లలో 150శాతం పెరుగుదల నమోదయింది. దానికి కారణం బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లే. జనన ధ్రువీకరణ పత్రాలలోనూ అలాంటి అవకతవకలే భారీగా ఉన్నాయి. ఫలితంగా ఆ ప్రాంతపు డెమొగ్రఫీ మొత్తం మారిపోయింది.
‘‘అసెంబ్లీలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వం ఈ విషయం మీద కిమ్మనడం లేదు. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారు. వాటిసాయంతో దొంగ ఓటర్లను పుట్టిస్తున్నారు. భారతీయ పౌరులకు ప్రజాస్వామికంగా దక్కాల్సిన హక్కులను లాగేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతున్నవారికి అధికారాలు కట్టబెడుతుండడం వెనుక భారీ కుట్ర ఉంది’’ అని మాజీ ఎమ్మెల్యే అనంత్ ఓఝా ఆందోళన వ్యక్తం చేసారు.
నకిలీ ఆధార్లతో చిక్కులు:
ఆధార్‌కార్డు చట్టపరంగా పౌరసత్వాన్ని నిరూపించే పత్రం కాదు. అయినా ఇంత భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం, వాటిలో అవకతవకలు బైటపడుతుండడం అనేవి చొరబాటుదార్ల ఉనికికి పరోక్ష సాక్ష్యమే. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అలాంటి కార్డులను పొరుగు దేశాల నుంచి అక్రమంగా చొరబడుతున్నవారు పప్పుబెల్లాల్లా సంపాదించుకుంటున్నారు. వాటితో లబ్ధి పొందుతున్నారు. నిజమైన భారతీయుల హక్కులను అక్రమంగా లాగేసుకుంటున్నారు. అలా, దేశ వ్యవస్థల మీద ఈ దొంగ ఆధార్ కార్డుల దుష్ప్రభావం తీవ్రంగా ఉంది.
ఒక ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ఝార్ఖండ్ హైకోర్టు, తమ రాష్ట్రంలో అక్రమ చొరబాట్ల వ్యవహారం మీద దర్యాప్తు చేయాలంటూ కేంద్ర నిఘా వర్గాలను ఆదేశించింది. తాజా ఇంటలిజెన్స్ ఆపరేషన్స్‌లో కనుగొన్న వివరాలు అక్రమ చొరబాటుదారుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయని చెబుతున్నాయి. ఆధార్ కార్డుల జారీలో ధ్రువీకరణ ప్రక్రియను మరింత కఠినంగా చేపట్టాల్సిన తక్షణ అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో పొరుగుదేశాల నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్ల ప్రమాదాన్ని ఎదుర్కోడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతయినా ఉంది.