భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద దెబ్బ తిగిలింది. స్త్రీ పాత్రలను శక్తివంతంగా తీర్చి దిద్దిన కళాత్మక దర్శకుడు శ్యామ్ బెనగళ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించి శ్యామ్ బెనగళ్ తుది శ్వాస విడిచారు.
భారత చిత్ర పరిశ్రమలో సత్యజిత్ రే వారసత్వాన్ని కొనసాగించిన దర్శకుల్లో శ్యామ్ బెనగళ్ ముందు వరుసలో ఉంటారు. కళాత్మక చిత్రాలు కూడా థియేటర్లో వంద రోజులు ఆడతాయని నిరూపించాడు. ఐదు దశాబ్దాల కిందట వచ్చిన అంకుర్ నుంచి 2021లో విడుదలైన జుబేదా వరకు ఆయన చిత్రాలు ప్రతిదీ విభిన్నమైనదే.
1934లో హైదరాబాద్‌లో జన్మించిన బెనగళ్ తెలంగాణ రైతాంగ పోరాటాలపై కూడా చిత్రాలు తీసి విజయం సాధించారు. ముంబైలో స్థిరపడి అనేక చిత్రాలు నిర్మించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఆయనకు ఆయనే సాటి. ఆయన పరిచయం చేసిన షబానా తొలి చిత్రంలోనే జాతీయ అవార్డు అందుకున్నారు. సుభాష్ చంద్రబోస్‌పై పరిశోధన చేసిన ఆయన నిర్మించిన చిత్రం ఎన్నో అవార్డులు అందుకుంది.
1976లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పరుష్కారం అందించింది. ఆ తరవాత పద్మభూషన్ అందుకున్నారు.2013లో ఏఎన్ఆర్ జీవిత కాల సాఫల్య అవార్డు ఆయన్ను వరించింది. ఆయన చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై కూడా సత్తాచాటాయి. 12 సంవత్సరాలకే చిన్న కెమెరాతో సినిమా తీసి ఔరా అనిపించిన శ్యామ్ బెనగళ్ మనందరికీ దూరమైనా ఆయన చిత్రాలు ప్రజలు గుండెల్లో జీవించే ఉంటాయి.