పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీహరికోటకు సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండి తెలిపింది. ఇప్పటికే కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గురువారం వరకు వర్షాలు కురుస్తాయని చెప్పారు. డిసెంబరు 18 వ తేదీ ఏర్పడిన అల్పపీడనం ఇంకా తీరందాటలేదు. ముందుగా ఇది ఆదివారం తీరందాటుతుందని అంచనా వేసినా, మంగళవారానికి కూడా తీరంవైపు కదలలేదు. ఇది మరింత బలపడే సూచనలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అల్పపీడనం ఉత్తరతమిళనాడు దక్షిణ కోస్తాల మధ్య తీరం దాటే అవకాశముంది. ఇది మరింత బలపడుతుందా లేదా అనే విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాలో బుధవారం వరకు మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉత్తరకోస్తాలోనూ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు.
వరుస అల్పపీడనాలతో ఖరీఫ్ వరి సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరి నూర్పిడి చేసిన రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నూర్పిడి పనులు గురువారం సాయంత్రం వరకు వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చారు.