జమ్మూకశ్మీర్లో ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంటోంది. అక్కడ సంకీర్ణ కూటముల పొత్తులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2024లో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్థానిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పొత్తులో పోటీ చేసాయి. కాంగ్రెస్ 38 స్థానాల్లో పోటీ చేసి 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56 సీట్లలో పోటీ చేసి 42 స్థానాల్లో విజయం సాధించింది. పొత్తులో మూడో పార్టీ అయిన సీపీఎం పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ గెలుపు దక్కించుకుంది.
జమ్మూకశ్మీర్ శాసనసభలో 90 స్థానాలు ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించడానికి కేవలం 4 సీట్ల దూరంలో ఆగిపోయింది. నిజానికి కాంగ్రెస్తో పొత్తులో ఉన్నప్పటికీ వారిమధ్య సఖ్యత సరిగ్గా కుదరలేదు. కాంగ్రెస్ తన శక్తికి మించిన స్థానాల్లో పోటీ చేసింది. వాటిలోనూ బలమైన పోటీ ఇవ్వలేకపోయింది. విచిత్రం ఏంటంటే, 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ పొత్తు పక్షం నేషనల్ కాన్ఫరెన్స్ మీద కూడా పోటీ చేసింది. ఆ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ శైలిపై ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాతా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్, దాని నాయకులైన ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా కాంగ్రెస్ను ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఆ పార్టీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఇప్పుడు కూడా ఎన్సీ పార్టీ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాల వైఖరి కాంగ్రెస్ పట్ల మరింత కఠినంగా మారింది. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా దానికి కొంత కారణమే అని చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఇండీ కూటమిగా పోటీ చేసాయి. కాంగ్రెస్ జమ్మూ ప్రాంతంలోని 2 స్థానాల్లో తన అభ్యర్ధులను నిలిపింది. కానీ కశ్మీర్ లోయ ప్రాంతంలోని 3 సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ స్నేహపూర్వకంగా పోటీ పడ్డాయి. అయితే ఇండీ కూటమికి నాయకుడిగా వ్యవహరించిన కాంగ్రెస్, తన రెండు మిత్రపక్షాల మధ్యా సయోధ్య కుదర్చలేదు, పరస్పర పోటీకి దిగకుండా నిలువరించలేదు. అప్పటినుంచే ఒమర్ అబ్దుల్లాకు, అతని పార్టీకి కాంగ్రెస్ మీద అసంతృప్తి మొదలైందని చెప్పవచ్చు.
ఓటింగ్లో ఈవీఎంల వినియోగం మీద కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు వారిని ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా విమర్శించాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల సాయంతోనే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని, ఆ సందర్భంగా ఆ పార్టీ సంబరాలు కూడా చేసుకుందని గుర్తు చేసాడు. అదే అసెంబ్లీ ఎన్నికలు, ఉపయెన్నికల్లో తాము సరిగ్గా రాణించలేకపోవడానికి ఈవీఎంలను నిందించడం సరికాదంటూ అభ్యంతరం చెప్పాడు. అలా ఈవీఎంల పేరు మీద కాంగ్రెస్కు ఒమర్ అబ్దుల్లా బలమైన సందేశం పంపించే ప్రయత్నం చేసాడు. ఆ సందేశమే ఇప్పుడు ఇండీ కూటమిలోని మిగతా పార్టీలకు మార్గదర్శకమైంది. ఈవీఎంల విషయంలో ఇండీ కూటమిలోని మరికొన్ని పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరి నుంచి దూరం జరిగాయి. ఒక్క సమాజ్వాదీ పార్టీ తప్ప ఇండీ కూటమిలోని మరే ఇతర పక్షం నుంచీ కాంగ్రెస్కు పూర్తి మద్దతు దొరకలేదు.
దీన్ని కాంగ్రెస్ మీద ఒమర్ అబ్దుల్లా తిరుగుబాటుగా భావించవచ్చు. ఇండీ కూటమిలోని చాలా పక్షాలు, ఏ కూటమిలోనూ చేరకుండా ఉన్న మరికొన్ని పార్టీలు సైతం నేషనల్ కాన్ఫరెన్స్ తిరుగుబాటుకు మౌనంగానే మద్దతు పలికాయి. అలాంటి వారిలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వంటివారు ఎందరో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ కూడా ఒక్క ఈవీఎంల విషయం మినహాయిస్తే మరే ఇతర విషయంలోనూ కాంగ్రెస్తో ఏకీభవించిన దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో, జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో కొత్త కూటమి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పట్ల ఒమర్ అబ్దుల్లా కఠిన వైఖరి చూస్తుంటే నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ మధ్య రాజకీయ ఒప్పందం కుదరవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒమర్ గతంలో వాజపేయి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసాడు కూడా. 1999లో వాజపేయి మొదటి ప్రభుత్వం ఒక్కఓటుతో ఓడిపోయినప్పటి పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. అప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి పార్లమెంటులో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వాజపేయికి అనుకూలంగా ఓటు వేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే బారాముల్లా ఎంపీ అయిన సైఫుద్దీన్ సోజ్ మాత్రం వారితో విభేదించాడు. మిగతా ఇద్దరు ఎంపీలూ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేసారు.
అలా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి బీజేపీతో సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత సంబంధాలను పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది.