మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్, ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పూజా ఖేద్కర్‌ను అరెస్టు చేయకుండా ఆగస్టులో ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పూజా ఖేద్కర్ నకిలీ పత్రాలను ఉపయోగించి ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణురాలు అయిందని బలమైన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. సర్టిఫికేట్ తనిఖీల వేళ సమర్పించిన రిజర్వేషన్లకు ఆమె అర్హురాలు కాదని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ వ్యవస్థనే తారుమారు చేయడానికి పూజా ఖేద్కర్ ప్రయత్నించారని కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పుడు ముందస్తు బెయిలిస్తే, ఆమె దర్యాప్తును సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో దర్యాప్తు పరిధిని విస్తృతం చేయాలని.. న్యాయబద్దంగా విచారణ జరపాలనీ దర్యాప్తు సంస్థను ఆదేశించింది.
పూజా ఖేద్కర్ కొన్నాళ్ళ క్రితం తన అతి ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పుణెలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆమెపై అధికార దుర్వినియోగం, యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్ష పాస్ అయిందని గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
ఆ నేపథ్యంలో పూజా ఖేద్కర్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని ఆరోపించారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. ఈ క్రమంలోనే తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.