తిరుపతి, సమీప మండలాల ప్రజలకు స్వామి వారి దర్శనం మరింత సులువు కానుంది. ఇప్పటికే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేకంగా ఉచిత దర్శనం కలిగించనున్నారు. ఇందుకు అవసరమైన టికెట్లు తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ ఆడిటోరియం హాల్లో జనవరి 5వ తేదీ అందుబాటులో ఉంచుతారు. జనవరి 7న మంగళవారం రోజు స్వామి దర్శనం ఉంటుంది. తిరుపతి, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల ప్రజలకు ఈ సదుపాయం కల్పించారు. స్థానికులు వారి ఆధార్ చూపించి టికెట్లు పొందాల్సి ఉంటుంది.
స్వామి వారి దర్శనం స్థానికులకు కష్టంగా మారిందని అనేక సంవత్సరాలుగా విమర్శలు వస్తున్నాయి. గతంలో స్వామి వారిని ప్రతి నెలా దర్శించుకునే వారి మని, నేడు రోజూ 70 మంది భక్తులు రావడంతో సంవత్సరానికి ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేకపోతున్నామని స్థానికులు అనేకమార్లు మొరపెట్టుకున్నారు. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి అమల్లోకి రానుంది.