కడప కార్పొరేషన్లో కుర్చీ రచ్చ మరోసారి ముదిరింది. కార్పొరేషన్ సమావేశంలో మేయర్ సీటు పక్కన స్థానిక ఎమ్మేల్యే మాధవీరెడ్డికి కుర్చీ వేయలేదని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు మేయర్ పక్కనే ప్రోటోకాల్ ప్రకారం సీట్లు వేయాల్సి ఉంటుంది. కానీ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ వేయలేదు. దీంతో టీడీపీ సభ్యులు మేయర్‌ను నిలదీశారు. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేయర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డి వాదనకు దిగారు.
కార్పొరేషన్ సమావేశాన్ని అడ్డుకున్న ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. ఇటీవల వీరంతా వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. గొడవకు దిగిన వైసీపీ సభ్యులను కూడా సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిరసనకు దిగారు. దీంతో కార్పొరేషన్లో మరోసారి గందరగోళం నెలకొంది.
కడప కార్పొరేషన్లో కుర్చీ గొడవ ఇది మొదటిసారి కాదు. గత నెలలో కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ వేయలేదని గొడవ జరిగింది. ఆ తరవాత ఏడుగురు వైసీపీ ఎమ్మేల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. మరికొంత మంది కూడా టీడీపీలోకి వస్తారంటూ ప్రచారం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో కడప కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో పడుబోతోందంటూ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన సర్వసభ్య సమావేశం తీవ్ర నిరసనలకు వేదికగా మారింది.