సరైన పత్రాలు లేకుండా అక్రమంగా భారత్లో చొరబడిన బంగ్లాదేశీయులపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. డిసెంబర్ 21 సాయంత్రం నుంచి చేపట్టిన 12గంటల ఆపరేషన్లో 175కు పైగా వ్యక్తులు సరైన పత్రాలు లేకుండా భారత్లో నివసిస్తున్నారని గుర్తించారు.
దేశ రాజధానిలో నివసిస్తున్న అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం డిసెంబర్ 11న కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. నగరంలో సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడం పోలీసులను సైతం ఆందోళనకు గురి చేసింది. అలాంటి వారివల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయన్నది వారి భయం.
ఆ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు కూడా జోడవడంతో పోలీసులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ప్రత్యేకించి, ఔటర్ ఢిల్లీలో సోదాలు ముమ్మరంగా చేపట్టారు. 12 గంటల వ్యవధిలో చేపట్టిన ఆ సోదాల్లో 175 మంది వ్యక్తులు ఎలాంటి పత్రాలూ లేకుండా పట్టుబడ్డారు. ప్రస్తుతం పోలీసులు వారి ఉనికి వివరాలను తనిఖీ చేస్తున్నారు.
ఔటర్ ఢిల్లీ పోలీస్ స్టేషన్కు చెందిన ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారం… ఆ ఆపరేషన్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. ఆ బృందాల్లో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, జిల్లా స్థాయి ప్రత్యేక యూనిట్లు, విదేశీ సెల్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తులు ఆ ప్రత్యేక బృందాల్లో ఉంటారు. ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్ళి, ఆ బృందాలు ఇల్లిల్లూ తనిఖీ చేసారు.
డిసెంబర్ 21 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్, డిసెంబర్ 22 శనివారం ఉదయం 11 గంటల వరకూ జరిగింది. సరైన పత్రాలు లేకుండా పట్టుబడిన 175 మంది ఇంటరాగేషన్ జరుగుతోంది. పోలీసులు వారి వివరాలను పరిశీలిస్తున్నారు, అదనపు ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో చూస్తున్నారు. దర్యాప్తు పూర్తయాక చట్టబద్ధమైన చర్యలు ప్రారంభిస్తారు.