అస్సాంలోని సోనాపూర్‌లో ఇద్దరు బంగ్లాదేశీ చొరబాటుదారులను స్థానిక ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ సంఘటన శనివారం జరిగింది.
మహమ్మద్ తాహిల్, అబ్దుల్ మన్నన్ అనే ఇద్దరు బంగ్లాదేశీయులు అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డారు. సరిహద్దులు దాటడంలో తమకు సహకరించిన మధ్యవర్తులకు రూ.20వేలు చొప్పున చెల్లించారు. అలా సోనాపూర్ చేరుకుని అక్కడ కోసుటోలీ ప్రాంతంలో నాలుగు నెలలుగా ఉంటున్నారు.
తాహిల్, మన్నన్ ఇద్దరూ బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాకు చెందినవారు. అక్రమంగా భారత్‌లోకి చొరబడినట్లు వారు ఒప్పుకున్నారు. వారి దగ్గర రెండు బంగ్లాదేశీ సిమ్ కార్డులు కూడా ఉన్నాయి. తమను ఎవరూ గుర్తు పట్టకుండా దొంగ పేర్లతో చెలామణీ అవుతున్నారు. సోనాపూర్‌లో కూలీలుగా పని సంపాదించామని వారు పోలీసు విచారణలో వెల్లడించారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు అనేది అస్సాంకు పెద్ద తలనొప్పిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. శుక్రవారం నాడు సమాగురీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అస్సాంను అస్థిరపరిచే అలాంటి చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.