ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా కువైట్ పర్యటన తర్వాత ఆ దేశం భారత్తో తమ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటామని ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు రంగాల్లో పరస్పర సహకారం కోసం జాయింట్ కమిషన్ ఆన్ కోపరేషన్ (జేసీసీ) ఏర్పాటు చేసింది.
వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ వంటి పలు కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకుంటామని ఇరు దేశాలూ స్పష్టం చేసాయి.
‘‘జేసీసీ ఏర్పాటును రెండు పక్షాలూ స్వాగతించాయి. రెండు దేశాల మధ్యా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పరిశీలించి, సమీక్షించడమే జేసీసీ ప్రధాన కర్తవ్యం. దానికి రెండు దేశాల విదేశాంగ మంత్రులూ నేతృత్వం వహిస్తారు. ద్వైపాక్షిక సహకారంలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, విజ్ఞానం, సాంకేతికత, భద్రత, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వ్యవసాయం, సాంస్కృతిక రంగాల్లో పనిచేయడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ సైతం ఏర్పాటయ్యాయి. జేసీసీ, జేడబ్ల్యూజీ సమావేశాల కోసం వీలైనంత త్వరగా సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నాం’’ అంటూ భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల కువైట్ పర్యటన పూర్తిచేసుకుని ఆదివారం సాయంత్రానికి భారత్ చేరుకున్నారు. ఒక భారత ప్రధాని కువైట్లో అధికారికంగా పర్యటించడం ఇదే గత 43 ఏళ్ళలో మొదటిసారి.