ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. సోమవారం సాయంత్రానికి దక్షిణ కోస్తా, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండి తెలిపింది. గురువారం సాయంత్రం వరకు మోస్తరు వర్షాలుకురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది.
అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట గంటకు 35 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పొడగాలుల ప్రభావంతో ఆదివారం తారందాటాల్సిన అల్పపీడనం సోమవారం వరకు కొనసాగనుంది. దీని ప్రభావం తగ్గినా, మోస్తరు వర్షాలకు అవకాశముంది.
వరి నూర్పిడి చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి నూర్పిడి చేసిన రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని సలహా ఇచ్చారు. రాబోయే నాలుగు రోజులు ఏపీలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ( ap rains) కురిసే అవకాశముంది. వాతావరణంలో తేమ తగ్గింది. చలి తీవ్రత కూడా తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.5, గరిష్ఠంగా 32 డిగ్రీలు నమోదవుతోంది.