ఈశాన్య భారతంలో మిజోరాం, మణిపుర్, నాగాలాండ్ సరిహద్దుల వద్ద జనాభా మ్యాపింగ్ చేయాలని కేంద్ర హో మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. భారత్, మయన్నార్ సరిహద్దుల్లో జనాభా మ్యాపింగ్ పూర్తి చేసి కంచె నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని షా వెల్లడించారు. షిల్లాంగ్ స్పేస్ అప్లికేషన్ కేంద్రం 12వ వార్షికోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్ధులను ఎంపిక చేసి, వారికి ఇస్రో కేంద్రాన్ని చూపించి, వారిలో సైన్స్ పట్ల ఆసక్తి పెరిగేలా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఖర్చును ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భరించాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చమురు, బొగ్గు నిక్షేపాల వివరాలను కూడా మ్యాపింగ్ చేయాలన్నారు. ఖనిజ వనరులు వెలికితీయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు.
తాము అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వరదల నివారణకు ఖచ్ఛితమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఖనిజాలను వెలికితీయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున రాయల్టీ వస్తుందని, దాని ద్వారా ఆదాయం పెరిగి అభివృద్ధికి దారి తీస్తుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు