సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్టు పై శాసనసభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అందే ప్రత్యేక రాయితీలు నిలిపివేస్తామని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రశక్తే లేదన్నారు.
‘పుష్ప2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ కు వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం శాసనసభలో ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో పోలీసులు సక్రమంగా వ్యవహరించారని తెలిపారు.
తొక్కిసలాటలో మహిళ చనిపోతే, 11వ రోజు వరకూ హీరో, ప్రొడ్యూసర్ ఎవరూ వారిని పరామర్శించలేదన్నారు. కనీసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి దగ్గరికి కూడా పోలేదు. ఇది ఏ రకమైన మానవత్వం అని ప్రశ్నించారు. ఇలా వ్యవహరించిన వారిపై పోలీసులు చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారన్నారు.
ఓ మహిళ చనిపోయిన ఘటనలో విచారణకు ఆదేశిస్తే దాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఓ హీరో, పోలీసు విచారణకు వెళితే దానిని తప్పుపడుతూ విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో షూటింగులు అడ్డుకున్నవాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే తప్పేంటన్నారు. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాన్ని విపక్షనేతలు, సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు.