బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్న హింసాత్మక దాడుల విషయంలో ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషనర్ గౌరాంగ దాస ఆందోళన వ్యక్తం చేసారు. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఇస్కాన్ ఆందోళన చెందుతోంది.
హిందూ దేవాలయాలకు భద్రత సమకూర్చాలని, హిందూ పౌరులకు రక్షణ కల్పించాలనీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి గౌరాంగ దాస విజ్ఞప్తి చేసారు. ‘‘బంగ్లాదేశ్‌లో పరిస్థితి గురించి ఇస్కాన్ ఆందోళన చెందుతోంది. అక్కడి హిందూ మైనారిటీల భద్రత గురించి మాకు ఆందోళనగా ఉంది. బంగ్లాదేశ్‌లోని అందరు పౌరులకూ, ప్రత్యేకించి మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని, అందరు అధికారులనూ కోరుతున్నాము. ప్రజలు తమ మత పద్ధతులను అనుసరించి స్వచ్ఛందంగా ప్రార్థనలు చేసుకునే దేవాలయాలను రక్షించండి. దేవాలయాలలోని దేవతా మూర్తులను, గుడులకు వెళ్ళే భక్తులనూ రక్షించండి’’ అని ఆయన కోరారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునే హక్కును కల్పించాలని గౌరాంగ దాస అర్ధించారు. ‘‘హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు.. ఇలా ఏ మతానికి చెందిన మైనారిటీలకైనా తమకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ఆచరించడానికీ స్వేచ్ఛ ఉండే హక్కును కల్పించాలని కోరుతున్నాము. అందరి ప్రార్థనా స్థలాలూ రక్షించబడాలి’’ అని గౌరాంగ దాస కోరారు.