ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటోన్న బంగ్లాదేశ్ విద్యార్ధులను గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.అక్రమ వలసదారులు నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారని, వారిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. జనన ధృవీకరణ పత్రాలు గుర్తించేందుకు ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది అనుసరించాల్సిన విధానాలను కూడా వివరించారు. ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
ఢిల్లీలో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక, స్థానికేతర వివాదం తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్, మయన్మార్ రొహింగ్యాలు ఢిల్లీలో అక్రమ నివాసాలు ఏర్పాటు చేసుకుని, వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారని వారిని గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం భావిస్తోంది. ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉంది.
పూర్వాంచల్, బిహార్ నుంచి వలస వచ్చిన పేదలనే లక్ష్యంగా చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. వారి ఇళ్లుకూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. రొహింగ్యాల పేరుతో పూర్వాంచల్ వాసులను ఖాళీ చేయాలని చూస్తున్నారనే వివాదం తెరమీదకు వచ్చింది.