అబ్రహామిక మతాలలోకి మారిన కొన్ని అస్సామీ కుటుంబాలు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసాయి. వారిలో 11మంది క్రైస్తవులు కాగా ఒక ముస్లిం కుటుంబం ఉంది.
విశ్వహిందూ పరిషత్ శుక్రవారం నాడు బొంగైగావ్ పట్టణంలో ఘర్ వాపసీ కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా 11మంది వ్యక్తులు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసారు. వారందరూ ‘కోచ్ రాజవంశి’ తెగకు చెందినవారు. వారు కొన్నేళ్ళ క్రితం క్రైస్తవంలోకి మతం మారారు. ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని భావించారు. తమ కోరికను స్థానిక విశ్వహిందూ పరిషత్ నాయకులకు తెలియజేసారు. విహెచ్పి నేతలు సనాతనధర్మంలోకి తిరిగి రావడానికి చట్టబద్ధమైన విధివిధానాలన్నీ పూర్తి చేయించారు. వైదిక సంప్రదాయాల ప్రకారం యజ్ఞం నిర్వహించి, ఆ క్రైస్తవులను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు.
మతం మారిన వారిలో ఒక వ్యక్తి తమ కథ చెప్పాడు. కొన్నేళ్ళ క్రితం కొంతమంది మిషనరీలు డబ్బు, ఇతర వస్తువుల ఆశ చూపి తమను క్రైస్తవంలోకి మతం మార్చారని వివరించాడు. క్రైస్తవ మిషనరీలు తమ ప్రాంతంలో ఒక చర్చ్ కట్టారని, పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని మతం మారుస్తున్నారనీ వెల్లడించాడు.
మరొక మహిళ తన కుమార్తె అనారోగ్యం కారణంగా మతం మారింది. క్రైస్తవంలోకి మతం మారితే తన కూతురి ఆరోగ్యం బాగుపడుతుందని మిషనరీలు ఆమెకు దుర్బోధ చేసారు. మతం మారినప్పటికీ ఆమె కుమార్తె ఆరోగ్యం బాగుపడలేదు, చివరికి ఆమె చనిపోయింది. ఆ సమయంలో మిషనరీలు ఆ మహిళకు ఎలాంటి సాయమూ చేయలేకపోయారు. దాంతో ఆమె నిజం తెలుసుకుంది.
అదే రోజు, గువాహటి సమీపంలోని సోనాపూర్ ప్రాంతంలో ఒక ముస్లిం జంట సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసింది. హఫీజ్ అలీ, అతని భార్య రిజ్వానా బేగం హిందూధర్మాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు వారి పేర్లు రాహుల్ బోడో, భూమికా బోడో. ఇటీవల ముస్లిములు చాలా నేరాలు చేస్తున్నారనీ, దానికి వారిని ప్రేరేపిస్తున్నది ఇస్లాం మతమేననీ ఆ జంట అర్ధం చేసుకున్నారు. కొన్నాళ్ళ క్రితం కొచ్చుతోలి ప్రాంతంలో లక్ష్మీపూజ జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అప్పటినుంచీ సనాతన ధర్మం పట్ల వారికి ఆసక్తి కలిగింది.
కొచ్చుతోలి అస్సాంలో గిరిజనులకు రిజర్వ్ చేసిన ప్రాంతం. కానీ కొన్నేళ్ళుగా బంగ్లాదేశీ ముస్లిములు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసారు. ఈమధ్య అస్సాం ప్రభుత్వం వారందరినీ అక్కణ్ణుంచి ఖాళీ చేయించింది. అదేమీ అంత సులువుగా జరగలేదు. ప్రభుత్వ, పోలీసు బృందాలపై ముస్లిములు దాడులు చేసారు. ఆ క్రమంలో 22మంది ప్రభుత్వ, పోలీసు అధికారులు గాయపడ్డారు. పోలీసుల ప్రతిఘటనలో ఇద్దరు దుండగులు హతమయ్యారు. అలా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాక స్థానిక ప్రజలు కాళీపూజ, లక్ష్మీ పూజ చేసారు. ఆ పూజకు చాలా ముస్లిం కుటుంబాలు హాజరయ్యాయి. వారు సనాతన ధర్మం విశిష్టతను గమనించారు. ఇప్పుడు వారిలో చాలామంది హిందూధర్మంలోకి రావాలని కోరుకుంటున్నారు.