ప్రకాశం జిల్లాలో ఇవాళ ఉదయం భూకంపం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు దర్శి, ముండ్లమూరు, కురిచేడు, శంకరాపురం, మారెళ్ల, తూర్పు కంభంపాడు ప్రాంతంలో భూమి కంపించింది.తాళ్లూరు మండలంలో కూడా 2 సెకన్లపాటు భూమి కంపించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల నుంచి విద్యార్థులు పరుగులు తీశారు. పెద్ద శబ్దంతో కూడా భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు.
భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదు. భూకంప తీవ్రత ఎంత ఉందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు 2 సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు.ఇలాంటి భారీ శబ్ధం గత మూడు దశాబ్దాల్లో చూడలేదని స్థానికులు తెలిపారు.
భూకంపంపై జీఎస్ఐ అధికారులు స్పందించాల్సి ఉంది. ప్రకాశం జిల్లా భూకంప జోన్ 3లో ఉంది. తక్కువ శ్రేణి భూకంపాలు ప్రకాశం జిల్లాలో వచ్చే అవకాశముంది. ఒంగోలు సమీపంలోని చీమకుర్తి గ్రానైట్ తవ్వకాల వల్ల కూడా స్వల్పంగా భూమి కంపిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.