శ్రీ దుర్గాభవానీ అమ్మవారి నామస్మరణతో విజయవాడ మార్మోగుతోంది. ఇంద్రకీలాద్రి పై నేటి నుంచి భవానీ దీక్ష విరమణలు జరుగుతున్నాయి. దీక్ష విరమణ మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శతచండీయాగం చేపట్టారు. ఈ యాగం ఐదురోజుల పాటు కొనసాగించనున్నారు.
దీక్ష విరమణ కోసం తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి కూడా భవానీలు సుమారు రెండు లక్షలకు పైగా రావచ్చు అనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి దర్శనానికి వస్తున్నభక్తులు తొలుత కృష్ణానది పరివాహక ఘాట్లలో పుణ్యస్నాన్ని ఆచరించి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ గిరి ప్రదక్షిణ దుర్గమ్మ శరణుఘోషతో మార్మోగుతోంది.
ప్రదక్షిణానంతరం వినాయక గుడి వద్ద ప్రారంభమవుతున్న క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు
ఆదిదంపతుల దర్శనం అనంతరం మహా మండపం దిగున ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద దీక్ష విరమణ చేసి, నేతి కొబ్బరికాయలను హోమగుండంలో సమర్పిస్తున్నారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
భవానీ దీక్షల విరమణ సందర్భంగా విజయవాడలో కట్టుదిట్టమైన భద్రత కలిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ ను మళ్లించారు. విజయవాడ నగరంలోకి వచ్చే వాహనాలను పలు ప్రాంతాల ద్వారా ఇతర మార్గాలకు మళ్ళిస్తున్నారు.ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.